
తమిళనాడు రాష్ట్రంలోని ప్రధాన విమానాశ్రయాల్లో ఒకటైన తిరుచ్చి విమానాశ్రయం ఇపుడు గోల్డ్ స్మగ్లింగ్ కేంద్రంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా అరబ్ దేశాల నుంచి ఇక్కడకు వచ్చే ప్రయాణికులు భారీ మొత్తంలో అడ్డదారుల్లో బంగారాన్ని తీసుకొస్తూ పట్టుబడుతున్నారు. గత పది రోజుల్లోనే రూ.1.50 కోట్ల విలువ చేసే బంగారంతో విదేశీ కరెన్సీ కూడా లభ్యమైంది. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి రోజూ దాదాపుగా 4 వేల మంది వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రధానంగా అరబ్ దేశాలతోపాటు మలేసియా, సింగపూర్, శ్రీలంక వంటి దేశాలకు వచ్చి వెళ్తుంటారు. అయితే… గత కొన్ని నెలలుగా ఈ ఎయిర్‌పోర్టు గోల్డ్ స్మగ్లింగ్‌కు కేంద్ర బిందువుగా మారిందనే విమర్శలు లేకపోలేదు. పలు దేశాల నుంచి ఇక్కడకు వచ్చే ప్రయాణికులను తనిఖీ చేసే కస్టమ్స్, రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అక్రమంగా తీసుకొచ్చే బంగారం, కరెన్సీ వంటి ఏదో ఒకటి స్వాధీనం చేసుకుంటూనే ఉన్నారు.
గత పదిరోజుల్లో ఇలా..
గత పది రోజుల్లో ఏకంగా రూ.1.50 కోట్ల విలువైన బంగారం, కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఎయిర్‌పోర్టు ఉన్నతాధికారులు స్పందిస్తూ ఇటీవల కాలంలో ఈ ఎయిర్‌పోర్టుకు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల వద్ద బంగారం, విదేశీ కరెన్సీ, ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలిపారు. మరికొంతమంది ప్రయాణికులు నిఘా వర్గాల కళ్ళుగప్పి తప్పించుకుంటున్నారని తెలిపారు. అందుకే ఈ విమానాశ్రయంలో భద్రత మరింత కట్టుదిట్టం చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు.





