
విజయనగరం — సంక్రాంతి పండగ ముగిసింది.. ఇక విజయనగరంలో జాతరలు మొదలయ్యాయి. జిల్లా అంతటా తీర్థాల పరంపర కనుమ రోజున ఆరంభమైంది. ఎక్కడ చూసినా విద్యుత్తు దీపాల అలంకరణలో అమ్మవార్ల ఆలయాలు.. భక్తజనంతో వాటి ప్రాంగణాలు నిండిపోయాయి. ఈ సందడి మరో నెల రోజులపాటు కొనసాగనుంది. విజయనగరం జిల్లాలోని వేపాడ మండలంలోని వీలుపర్తి- వెల్దాం గ్రామాల ప్రజల ఆరాధ్య దేవత నేరెళ్ల పైడిమాంబ అమ్మవారి తీర్థం బుధవారం మొదలైంది. ఈ మండలంలో అత్యధికంగా జాతర్లు జరుగుతుంటాయి. ఇక అదే మండలంలోని గుడివాడ, ఆకులసీతంపేట, కరకవలస, చామలాపల్లి గ్రామాలకు చెందిన కొండగుళ్లు బ్రహ్మలింగేశ్వరస్వామి తీర్థం సోమవారం వైభవంగా జరిగింది. గంట్యాడ మండలం కొటారుబిల్లిలో కనకదుర్గమ్మ తీర్థం, లక్కవరపుకోట మండలం కల్లేపల్లిరేగ గ్రామంలో శ్రీగృహలింగేశ్వరస్వామి తీర్థం, శృంగవరపుకోట మండలం ధర్మవరం పంచాయతీ మారుతీనగర్‌లో అంకమ్మ పేరంటాల తీర్థం ఇప్పటికే వైభవంగా జరిగాయి. కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం పంచాయతీ దత్తి గ్రామానికి చెందిన మరిడిమాంబ తీర్థం ఘనంగా జరుగుతోంది. జిల్లాలోనే పెద్ద జాతర్లుగా పేరొందిన జామి ఎల్లారమ్మ, రాజాం పోలిపల్లి పైడితల్లి, చీపురుపల్లి కనకమహాలక్ష్మీ తీర్థాలు వచ్చేనెలలో జరుగనున్నాయి. మరోవైపు జాతర్ల సందర్భంగా సంగిడీ రాళ్లు, ఎద్దుల పరుగుపోటీలు, ఆటల పోటీలను విరివిగా ఏర్పాటు చేస్తున్నారు. పిల్లల ఆట బొమ్మలు, ఇళ్లలో వాడే అలంకార, ప్లాస్టిక్, స్టీల్ సామగ్రి షాపులు, తినుబండారాల దుకాణాలకు అంతే లేదు. జెయింట్‌వీళ్లు, సర్కస్‌లతో ఎగ్జిబిషన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వాటిల్లో పెద్దలు, చిన్నలు కేరింతలు కొడుతున్నారు.
పోలమాంబ దర్శనానికి పోటెత్తిన భక్తులు..
ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం, కోర్కెలు తీర్చే కల్పవల్లి శంబర పోలమాంబ అమ్మవారి చదురుగుడికి భక్తుల తాకిడి పెరిగింది. పోలమాంబ పండగ ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తజనానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవదాయశాఖధికారులు ఏర్పాట్లు చేశారు. అసలు పండగకు క్యూలైన్లతో పాటు ఇతరత్రా సన్నద్ధ పనుల్లో సిబ్బంది నిమగ్నమయ్యారు. సిరిమాను తిరిగే ప్రాంతంలో రహదారి పనులను వేగవంతం చేస్తున్నారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





