News

బురఖాతో వచ్చే విద్యార్థినులకు నో ఎంట్రి అని చెప్పిన కళాశాల యాజమాన్యం… ఆ తర్వాత ఏం జరిగిందంటే?

307views

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్‌లోని ఓ హిందూ కళాశాలకు ముస్లిం విద్యార్థినులు బురఖా ధరించి రావడం ఉద్రిక్తతకు దారితీసింది. బురఖా ధరించి వచ్చిన విద్యార్థినులను ఆ కళాశాల సిబ్బంది గేటు వద్దనే నిలువరించారు. బురఖా తొలగించి కళాశాలలోని తరగతులకు వెళ్లాలని సూచించారు. కానీ వారి మాటలను ముస్లిం బాలికలు వినలేదు. గేటు వద్దే ఉండిపోయారు. ఈక్రమంలో విద్యార్థినులకు సమాజ్‌వాదీ ఛత్ర సభ కార్యకర్తలు మద్దతుగా నిలిచారు. ఈనేపథ్యంలో కళాశాల ప్రొఫెసర్లకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. బురఖా వివాదంపై హిందూ కాలేజీలో జరిగిన ఘటనపై వీడియో ఇంటర్నెట్‌లో ప్రస్తుతం హల్‌చల్ చేస్తోంది.

కళాశాల ప్రొఫెసర్లు ఎమంటున్నారంటే..
కళాశాలలో తాము విద్యార్థులకు డ్రెస్ కోడ్‌ను అమలు చేస్తున్నామని, దీన్ని అనుసరించడానికి నిరాకరించిన వారు ఎవరైనా కళాశాల క్యాంపస్‌లోకి ప్రవేశించకుండా నిషేధిస్తామని కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎపి సింగ్ స్పష్టం చేశారు. మరోవైపు కాలేజీ డ్రెస్‌కోడ్‌లో బురఖాను చేర్చాలని, అమ్మాయిలు బురఖాను ధరించి తరగతులకు హాజరుకావాలని కోరుతూ సమాజ్‌వాదీ ఛత్ర సభ సభ్యులు కళాశాల ప్రిన్సిపల్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ బురఖా వివాదం గతంలో కర్ణాటక రాష్ట్రంలోనూ రాజుకుంది.

గతంలో కర్ణాటక కోర్టు ఇచ్చిన తీర్పు ఇలా..
గత ఏడాది(2022) జనవరిలో కర్ణాటక రాష్ట్రంలోని ఉడుప్పి జిల్లాలో ఉన్న పీయూ కళాశాలలో కొందరు ముస్లిం విద్యార్థినులు బురఖా ధరించి తరగతి గదులకు వచ్చారు. దీనిపై పలువురు విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ముస్లింలు, హిందూ విద్యార్థుల మధ్య పెద్దఎత్తున వివాదం రాచుకుంది. ఈ సంఘటన దేశం అంతటా వ్యాపించింది. ఈక్రమంలో పలు కళాశాలలో విద్యార్థులు బొట్లు, కాషాయం వస్త్రాలు ధరించి వచ్చారు. దీంతో సుప్రీంకోర్టు, కర్ణాటక రాష్ట్ర హైకోర్టు స్పందించింది. విద్యార్థులు ఆయా పాఠశాల లేదా కళాశాల యాజమాన్యం సూచించిన విధంగా యూనిఫామ్‌లను ధరించాలని.. ఇతర ఏ మతపరమైన దుస్తులు ధరించవద్దని తేల్చిచెప్పింది. బురాఖా, హిజాబ్‌ ధరించాలని చెప్పడం ఇస్లాం మతం యొక్క ప్రధాన ఆచారం కూడా కాదని పేర్కొంది.

Leave a Response