News

యాదగిరి గుట్ట లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న సీఎంలు

283views

యాదగిరి గుట్ట స్వయంభు శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారిని సీఎంలు కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎంల వెంట తెలంగాణ ఎంపీ సంతోష్, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత తదితరులు ఉన్నారు. యాదాద్రి ఆలయంలో దర్శనానికి కమ్యూనిస్టు నేతలు కేరళ సీఎం పినరయ్‌ విజయన్‌, డి. రాజాలు వెళ్లకుండా ప్రెసిడెన్షియల్ సూట్‌లోనే ఉండిపోయారు.

టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత తొలి భారీ బహిరంగ సభ బుధవారం ఖమ్మంలో జరగనుంది. ఈ సభకు నలుగురు ముఖ్యమంత్రులు, పలువురు మాజీ సీఎంలు, జాతీయ స్థాయి నేతలు సహా దాదాపు వెయ్యిమంది వీవీఐపీలు సభకు హాజరుకానున్నారు. బీఆర్‌ఎస్‌ను జాతీయ స్థాయికి విస్తరించాలని సంకల్పం చెప్పుకొన్న నేపథ్యంలో సభ నిర్వహణను బీఆర్‌ఎస్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. వామపక్ష ఉద్యమాలకు, తెలంగాణసాయుధ పోరాటానికి గుమ్మంగా నిలిచిన ఖమ్మాన్ని ఇందుకు వేదికగా ఎంచుకుంది. బీఆర్‌ఎఎస్‌తోపాటు ఆమ్‌ ఆద్మీ, వామపక్షాల ఐక్యత సభలో ప్రతిఫలించనుంది. సభకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ఢిల్లీ, పంజాబ్‌, కేరళ ముఖ్యమంత్రులు అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌, పినరయి విజయన్‌ హాజరు కానున్నారు. యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌, సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా తదితరులు రానున్నారు. సభకు 20 వేల మంది వీఐపీలు, వెయ్యి మంది వీవీఐపీలు, బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్న ఇతర రాష్ట్రాల్లోని ప్రాంతీయ, జాతీయ పార్టీలు, సంఘాల నాయకులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, హాజరుకానున్నారు.