News

తమిళనాడు పేరు మార్చాలని అనలేదు – గవర్నర్ ఆర్‌ఎన్‌ రవి స్పష్టం

270views

తమిళనాడు ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల విషయంలో మొదలైన రగడ అక్కడి నుంచి ముదురుతూ వచ్చింది. తమిళనాడు పేరు మార్చి “తమిళగమ్‌” అని పెట్టాలని గవర్నర్ సూచించినట్టు కొన్ని రోజులుగా పెద్దఎత్తున ఆ రాష్ట్రంలో ప్రచారం జరుగుతోంది. దీనిపై తమిళనాడు వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత కూడా వస్తోంది. ఈ క్రమంలోనే గవర్నర్ ఆర్‌ఎన్‌ రవి స్పందించారు. తన వ్యాఖ్యలను తప్పుదోవ పట్టిస్తున్నారని… అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. తమిళనాడు పేరు మార్చాలని తాను ఎక్కడా చెప్పలేదని తెలిపారు. కాశీకి, తమిళులకు చారిత్రకంగా, సాంస్కృతికంగా బంధం ఉందని చెబుతూ “తమిళగమ్‌” అనే పదాన్ని వాడానని తెలిపారు. అప్పట్లో తమిళనాడు లేదని చేసిన వ్యాఖ్యలూ దుమారం రేపుతున్నాయి. “కేవలం చారిత్రక నేపథ్యాన్ని ఉద్దేశించి మాత్రమే తాను ఆ పదాన్ని వాడాను అని స్పష్టతనిచ్చినా తనపై విమర్శలు మాత్రం ఆగడం లేదని అన్నారు. తమిళనాడు సంస్కృతికి తాను వ్యతిరేకినని ప్రచారం చేస్తున్నారని.. అందుకే దీనిపై వివరణ ఇస్తున్నట్లు గవర్నర్‌ పేర్కొన్నారు. దేశం మొత్తం ఓ విధానం అనుసరిస్తే… దాన్ని కాదని వ్యతిరేకించడం తమిళనాడుకి అలవాటైపోయిందని విమర్శించారు.

గవర్నర్ ఆర్‌ఎన్ రవి సివిల్‌ సర్వీసెస్‌ ఇంటర్వ్యూల కోసం వచ్చిన వాళ్లతో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏవైనా విభేదాలు తలెత్తితే… సివిల్ సర్వీసెస్ అధికారులంతా కేంద్రానికి సపోర్ట్ ఇవ్వాలని ఆర్‌ఎన్ రవి అన్నారు. “కేంద్రం, రాష్ట్రం మధ్య ఏదైనా విభేదం వస్తే మీరు తప్పకుండా కేంద్రానికే మద్దతుగా నిలబడాలి. ఇందులో ఎలాంటి అనుమానాలు ఉండకూడదు” అని తేల్చి చెప్పారు. తమిళనాడు అసెంబ్లీలో EWS రిజర్వేషన్ల అమలుపై చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. స్టాలిన్ ప్రభుత్వం ఈ రిజర్వేషన్ల అమలుని ససేమిరా అంటున్నారు. సామాజిక న్యాయం కోణంలో ఆలోచిస్తే ఇది విరుద్ధమని తేల్చి చెప్పింది. ఈ విషయంలో ప్రభుత్వంతో విభేదించిన గవర్నర్ ఆర్‌ఎన్ రవి సభ నుంచి వాకౌట్ చేశారు. దీనిపై డీఎమ్‌కే మద్దతుదారులు పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా డీఎమ్‌కేకి మద్దతునిచ్చే విద్యార్థి సంఘాలు కూడా నిరసనలు దిగుతున్నాయి. గవర్నర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నాయి. తమిళనాడు రాజ్‌భవన్‌పై ఆర్‌ఎన్ రవికి వ్యతిరేకంగా కొందరు పోస్టర్లు కూడా అంటించారు.