News

విజేత పెట్నికోట శ్రీ సీతారామాంజనేయ జట్టు… నంద్యాలలో ఘనంగా ‘ఆదిజాంబవ, చెన్నకేశవ’ భజన పోటీలు

560views

నంద్యాల: ఏపీలోని నంద్యాల జిల్లా, స్థానిక సమరసతా సేవా ఫౌండేషన్, ధర్మ జాగరణ సమితి ఎస్సీ కులస్థులకు దీక్షా దుస్తులు, సామగ్రి సమకూర్చడం, దేవాలయాలను పరిశుభ్రం చేయడం లాంటి వినూత్న కార్యక్రమాల్లో ముందుండం పాఠకులకు విదితమే. ప్రస్తుతం కార్తీకమాసం సందర్భంగా సమరత సేవా ఫౌండేషన్ భజన పోటీలను నిర్వహించింది. ఆది జాంబవ చెన్నకేశవ వంశస్తులకు మాత్రమే ప్రత్యేకంగా పోటీలు నిర్వహించింది. నంద్యాలలోని ఎస్‌బీఐ కాలనీ రామాలయంలో నిర్వహించారు.

 

ముఖ్య అతిథులుగా నంద్యాల పార్లమెంటు సభ్యుడు పోచ బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య, చెన్నకేశవ వంశస్థులు రామదాసు, ప్రముఖ విద్యావేత్త జి.రామకృష్ణారెడ్డి, డాక్టర్ ఉదయ్ శంకర్, యోగా గురువు దామోదర్ రెడ్డి, లాయర్ శ్రీదేవి, చంద్రశేఖర్ రెడ్డి, రాంప్రసాద్, చింతల పల్లె వాసు, సత్యం రెడ్డి, మన ఊరు మన గుడి మన బాధ్యత సేవకులు వెంకటేష్, రాధా ప్రసాద్, శేఖర్ అప్ప, హరి ప్రసాద్, కటకం రఘువీర్, నరసింహ రాజు, మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.

సౌజన్య హీరో మోటార్స్ అధినేత చిరంజీవి రెడ్డి, రామమద్దయ్య, నయన ఐ కేర్ డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, సక్షమ్ నగర అధ్యక్షుడు డాక్టర్ నేట్ల మహేశ్వర రెడ్డి, గోళ్ళసదర్శన్, సముద్రాల నాగరాజు, నరసింహరాజు, భీమనపల్లి వెంకటసుబ్బయ్య, నరసింహరాజు ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించారు. పోటీలు ఆద్యంతం శ్రోతలను భక్తితన్మయత్వంలో ఓలలాడించాయి.

మొత్తం అయిదు జిల్లాల నుండి 19 జట్లు పాల్గొని, పోటా పోటీగా ప్రదర్శన ఇవ్వగా పెట్నికోట శ్రీ సీతారామాంజనేయ జట్టు 98 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచి 25 వేల విలువైన హార్మోనియం దక్కించుకుంది. ఏనుగు మర్రిజట్టు 96.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి 20 వేలు విలువైన మైక్ సెట్టు, తబలా గెలుచుకుంది. కట్టక్రిందిపల్లె జట్టు 95 పాయింట్లతో తృతీయ స్థానంలో నిలిచి మైక్ సెట్, డోలక్ కైవసం చేసుకుంది. మొత్తం పది బహుమతులు ప్రదానం చేశారు. భజన బృందంలోని మాతృమూర్తులను పసుపు కుంకుమ, చీరారవికలతో సత్కరించారు. 19 జట్టుల గురువులకు నూతన వస్త్రాలు, మొమెంటో, శాలువా, పూలమాలలతో నిర్వహకులు ఘనంగా సత్కరించారు. న్యాయనిర్ణేతలుగా జి.సోమన్నయాదవ్‌, ఆర్‌కే రెడ్డి వ్యవహరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి