News

కర్ణాటక బాంబు దాడి కేసులో అంతర్జాతీయ ఉగ్రసంస్థల హస్తం!

382views

మంగళూరు: మంగళూరు శివారులో ఆటోలో పేలిన ప్రెజర్‌కుక్కర్ బాంబు వెనక…. ఉగ్రమూకల కుట్ర బహిర్గతమైంది. ఐఎస్​ఐఎస్​ ఉగ్రవాద సంస్థతో ప్రభావితమైన మహమ్మద్‌షరీఖ్‌.. కర్ణాటకలో పలు చోట్ల పేలుళ్ళులకు కుట్ర పన్నినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ప్రమాదవశాత్తూ బాంబు పేలడంతో తీవ్రంగా గాయపడిన షరీఖ్‌.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి వద్ద ఉన్న ఆధార్ కార్డు.. నకిలీదని గుర్తించిన పోలీసులు మైసూరులో అతడు అద్దెకు ఉంటున్న ఇంటిలో తనిఖీలు చేయగా.. కుట్ర కోణం వెలుగుచూసింది.

యాప్​లో చూసి బాంబు తయారీ..

24 ఏళ్ళ షరీఖ్‌ శివమొగ్గ జిల్లా తిర్థనహల్లికి చెందినవాడని.. పోలీసులు గుర్తించారు. దేశంలో ఐఎస్​ఐఎస్​ ఉగ్రసంస్థ స్థావరం ఏర్పాటు సహా భారత్‌లో ఖలీఫా రాజ్యం తేవాలనేది షరీఖ్‌ లక్ష్యమని పోలీసులు వివరించారు. ఒక యాప్‌ ద్వారా సిరియాలోని ఐఎస్​ ఉగ్రసంస్థతో.. షరీఖ్‌కు సంబంధాలు ఏర్పడ్డాయని దర్యాప్తులో గుర్తించారు. బాంబు ఎలా తయారు చేయాలో ఆ యాప్‌ద్వారా షరీఖ్‌కు ఒక పీడీఎఫ్ అందిందని తేల్చారు. అలా తయారు చేసిన బాంబులను తుంగ నదీ తీరాన పరీక్షించినట్టు పోలీసులు కనిపెట్టారు. మైసూరు నుంచి.. ఆటోలో ప్రెజర్‌కుక్కర్ బాంబు తీసుకుని వస్తుండగా మంగళూరు శివారులో.. అది పేలిపోయిందని చెప్పారు. పేలుడులో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న అతడు.. ప్రస్తుతం మాట్లాడే స్థితిలో లేడని, కుటుంబ సభ్యులు.. అతడిని గుర్తుపట్టారని పోలీసులు వివరించారు.

షరీఖ్‌కు కర్ణాటక వెలుపల నుంచి సహకరిస్తున్నవారి వివరాలను.. తెలుసుకునేందుకు పోలీసులు నిమగ్నమయ్యారు. జాతీయ దర్యాప్తు సంస్థతో కలిసి ఉగ్ర కుట్రను చేధించేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు వివరించారు. శివమొగ్గ అల్లర్ల తర్వాత పారిపోయిన షరీఖ్‌కు ఎవరు ఆశ్రయమిస్తున్నారో తెలుసుకునేందుకు.. ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. నిందితుడు కోలుకుంటే.. మరిన్ని కుట్రలు వెలుగుచూసే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి