
బెంగళూరు: ‘‘మిగతా ప్రపంచమంతా నానా సంక్షోభాల్లో చిక్కిన వేళ భారత్ మాత్రమే అన్ని రంగాల్లోనూ దూసుకుపోతూ అతి పెద్ద ఆశాకిరణంగా కనిపిస్తోంది. ఆర్థికవేత్తలంతా ముక్తకంఠంతో చెబుతున్న విషయమిది. ఈ నేపథ్యంలో ప్రపంచమంతా మన దేశంపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విధాన స్థాయిలో విపరీతమైన అలసత్వం, నిర్ణయాల్లో అయోమయం వంటివాటికి బీజేపీ హయాంలో పూర్తిగా తెర దించి పెట్టుబడులకు ఎర్రతివాచీ పరచడం వల్లే ఇదంతా సాధ్యమైందని చెప్పారు. బుధవారం బెంగళూరులో మొదలైన మూడు రోజుల ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు, ఇన్వెస్ట్ కర్నాటక–2022ను ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
‘‘గతేడాది భారత్‌కు రికార్డు స్థాయిలో ఏకంగా 8,400 కోట్ల డాలర్ల మేరకు ఎఫ్‌డీఐలు వచ్చాయి. ప్రపంచాన్ని కమ్మేసిన కరోనా కల్లోలం, ఉక్రెయిన్ యుద్ధ భయాల వేళ ఇది చాలా పెద్ద ఘనత. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లన్నీ ఒడిదొడుకులమయంగా సాగుతున్నాయి. కానీ భారత్ మాత్రం ఆర్థికంగా అద్భుతాలు చేసి చూపుతోంది. మన ఆర్థిక వ్యవస్థ పునాదులు అత్యంత పటిష్ఠంగా ఉండటమే ఇందుకు కారణమని ప్రపంచమంతా విశ్వసిస్తోంది. ఇటీవలి కాలంలో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు మన సన్నద్ధత స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పాయి’’ అన్నారు.





