
న్యూఢిల్లీ: సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. సుదృఢ భారతదేశం కోసం, ప్రజాస్వామ్యం బలోపేతం కోసం ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు. ములాయం కుటుంబసభ్యులకు, ఆయన మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ములాయం సింగ్ మరణం.. భారత దేశానికి తీరని లోటని అన్నారు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. “‘ధరణి పుత్రుడు’ ములాయం.. సీనియర్ నేత. అన్ని పార్టీల వారు ఆయన్ను గౌరవించేవారు. సామాన్య నేపథ్యం నుంచి వచ్చి ములాయం సాధించిన విజయాలు.. అసాధారణమైనవి. ములాయం కుటుంబసభ్యులు, మద్దతుదారులకు నా ప్రగాఢ సానుభూతి” అని ట్వీట్ చేశారు ద్రౌపది.
ప్రజాస్వామ్యం కోసం ఓ సైనికుడిలా..
ములాయంతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ములాయం యూపీ సీఎంగా, తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేకసార్లు కలిశామని.. ఆ తర్వాత కూడా తమ బంధం కొనసాగిందని చెప్పారు.
రాజ్నాథ్ సింగ్, కేజ్రీవాల్ సంతాపం..
రాజకీయ కురువృద్ధుడు ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. యూపీ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించిన నాయకుడు అని కొనియాడారు. ఎస్పీ అధినేత ములాయం సింగ్ మృతి పట్ల దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. ములాయం కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.





