
దేశంలో ఉన్నత ప్రమాణాలతో కూడిన శాస్త్ర (సైన్స్), సాంకేతిక (టెక్నాలజీ), సృజనాత్మక (ఇన్నోవేషన్) వ్యవస్థను నిర్మించడంలో కేంద్ర-రాష్ట్రాల పరస్పర సమన్వయం, సహకార యంత్రాంగాన్ని బలోపేతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం తొలిసారి ఈ కేంద్ర-రాష్ట్ర సైన్స్ సదస్సును నిర్వహిస్తోంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును ప్రధాని మోడీ శనివారం (10/9/2022) ప్రారంభించారు. ఈ సదస్సులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, యువ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
అయితే ఈ సదస్సుకు ఝార్ఖండ్, బిహార్ ప్రభుత్వాలు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. గైర్హాజరీపై ఆయా రాష్ట్రాల నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు. అయితే, దీనిపై భాజపా నేతలు విమర్శలు చేస్తున్నారు. ”ఆ రెండు రాష్ట్రాలకు సైన్స్, ఇన్నోవేషన్ అంత ప్రాధాన్యం కాదేమో” అంటూ భాజపా వర్గాలు వ్యంగ్యాస్త్రాలు గుప్పిస్తున్నారు.





