News

తీస్తా సెతల్వాద్ కు సుప్రీం బెయిలు

380views

2002 నాటి గుజరాత్‌ అల్లర్ల (Gujarat riots) కేసులో విచారణనెదుర్కొంటున్న నిందితురాలు తీస్తా సెతల్వాద్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

తనకు బెయిల్ నిరాకరిస్తూ సెషన్స్ కోర్టు, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ తీస్తా సెతల్వాద్ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా శుక్రవారం ఆ పిటిషన్ ‌ను విచారించిన ధర్మాసనం ఆమెకు బెయిల్‌ ఇచ్చేందుకు అంగీకరించింది. సెతల్వాద్ తరఫున ప్రముఖ న్యాయవాది, కాంగ్రెస్ నేత కపిల్‌ సిబల్‌ కోర్టులో తన వాదనలు వినిపించారు.

గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్ల విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందానికి, పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై తీస్తాతోపాటు రిటైర్డ్‌ డీజీపీ ఆర్బీ శ్రీకుమార్‌, మాజీ ఐపీఎస్‌ అధికారి సంజీవ్‌ భట్‌లపై అహ్మదాబాద్ ‌లో గత జూన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో భాగంగా అదే నెల 25న గుజరాత్‌ యాంటీ టెర్రర్‌ స్క్వాడ్ ‌(ఏటీఎస్‌) ముంబయిలో తీస్తాను అదుపులోకి తీసుకుంది. కాగా అప్పటినుంచి రెండు నెలలకు పైగా ఆమె జైల్లోనే ఉన్నారు.

గుజరాత్‌ అల్లర్ల వెనుక భారీ కుట్ర కోణం ఉందని, దీనిపై పునర్విచారణ జరిపించాలని కోరుతూ నాటి ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన కాంగ్రెస్‌ దివంగత ఎంపీ ఎహ్‌సాన్‌ జాఫ్రీ భార్య జాకియా జాఫ్రీ వేసిన పిటిషన్ ‌ను సుప్రీం కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తీస్తా సెతల్వాద్‌ రెండో పిటిషనర్ ‌గా ఉన్నారు. గుజరాత్ అల్లర్ల విషయంలో నిత్యం వివాదం రగులుతూ ఉండేలా దురుద్దేశపూర్వకంగా పిటిషన్లు వేశారని సుప్రీం ధర్మాసనం మండిపడింది. విచారణ ప్రక్రియ దుర్వినియోగంలో భాగస్వాములైన వారందరిపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలని సుప్రీం వ్యాఖ్యానించింది. కాగా ఆ మరుసటి రోజే తీస్తాను ఏటీఎస్‌ అధికారులు అరెస్టు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.