
-
భారీ కుట్రను ఛేదించిన నిఘా సంస్థలు
గువాహటి: భారత్‌లో జిహాదీ భావజాలాన్ని వ్యాపింపజేసేందుకు భారీ కుట్ర జరుపుతున్నట్టు నిఘా సంస్థలు నిగ్గు తేల్చాయి. ఇటీవల అసోంలో పట్టుబడ్డ అల్ కాయిదా ఇన్ ఇండియన్ సబ్-కాంటినెంట్ (ఏక్యూఐఎస్), దాని అనుబంధ సంస్థ అన్సారుల్ బంగ్లా టీమ్(ఏబీటీ) ద్వారా ఈ కుట్ర వెల్లడైనది.
ఇప్పటికిప్పుడు దేశంలో విధ్వంసాలకు పథకాలు రూపొందించలేదని, అయితే, తొలుత జిహాదీ భావజాలాన్ని విస్తరించడం, స్లీపర్‌సెల్స్‌ను భారీగా రిక్రూట్ చేసుకోవడం వీరి ప్రధాన టాస్క్ అని గుర్తించారు. జులై 24న గోల్‌పరా జిల్లా పకీయుర్వా గ్రామానికి చెందిన అబ్బాస్ అలీ అనే 21 ఏళ్ళ ఇమామ్/మదర్సా టీచర్ అరెస్టు తర్వాత అసోంలో ఏక్యూఐఎస్ మాడ్యూల్ మూలాలు వెలుగులోకి వచ్చాయి. అబ్బాస్‌ను విచారించగా వెలుగులోకి వచ్చిన వివరాలతో గడిచిన 20 రోజుల్లో 37 మంది ఏక్యూఐఎస్, ఏబీటీ ఉగ్రవాదులను అరెస్టు చేసినట్టు అస్సాం పోలీసులు తెలిపారు.
‘‘పశ్చిమ బెంగాల్‌లో గత నెల 17న అరెస్టయిన అబ్దుల్ రఖీప్ అనే ఉగ్రవాదితో వీరికి సంబంధాలున్నట్టు తేలింది. గత నెల 21న పట్టుబడ్డ మసీదుల్లో ఇమామ్‌లుగా, మదర్సా టీచర్లుగా పనిచేస్తున్న అబ్దుస్ సుభాన్, జలాలుద్దీన్ షేక్‌తోపాటు, గత శుక్రవారం పట్టుబడ్డ హఫీజ్ రెహ్మాన్ ముఫ్తీ అనే మదర్సా టీచర్ ఈ నెట్‌వర్క్‌లో కీలక వ్యక్తులు’’ అని ఆయన వివరించారు.
Source: Nijamtoday





