
-
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాలను ప్రస్తావిస్తూ ఈ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో మనీష్ సిసోడియా తొలి నిందితుడే అయినా ఈ కుంభకోణం ప్రధాన సూత్రధారి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సంచలన ఆరోపణలు చేశారు.
కేజ్రీవాల్ మీడియా ముందుకు వచ్చి 24 గంటల్లోగా తనకు జవాబివ్వాలని అనురాగ్ ఠాకూర్ సవాల్ విసిరారు. సిసోడియాకు కేవలం డబ్బు వ్యామోహంతో మనీ తీసుకుని మౌనంగా ఉంటున్నాడని, మనీశ్ సిసోడియా తన పేరును ‘మనీ-ష్’గా మార్చుకోవాలని ఎద్దేవాచేశారు. విలేఖరుల సమావేశానికి హాజరైన మనీష్ సిసోడియా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయారని గుర్తు చేశారు.
కేజ్రీవాల్ ప్రజలను మోసం చేయడం మానుకోవాలని చెబుతూ ఓ అవినీతి పరుడు ఎన్నిసార్లు కొట్టిపారవేసినా అతని అవినీతి ఎక్కడికి పోదని చెప్పారు. ఈ కేసును సీబీఐ దర్యాప్తుకు అందించిన రోజుననే మద్యం విధానాన్ని ఢిల్లీ ప్రభుత్వం వెనుకకు తీసుకున్నదని ఠాకూర్ గుర్తు చేశారు. తన మంత్రి సత్యేందర్ జైన్ జైలుకు వెళ్లినప్పటికీ అతనిని పార్టీ నుండి కేజ్రీవాల్ బహిష్కరింపలేదని విమర్శించారు.
Source: Nijamtoday





