News

ఆలయం వద్ద తొక్కిసలాటలో ముగ్గురు మృతి.. మోదీ సంతాపం

356views

సికార్‌: రాజస్థాన్.. సికార్‌లోని ఖాటూ శ్యామ్‌జీ ఆలయం వెలుపల సోమవారం ఉదయం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మరణించారు. మరో నలుగురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్ని జైపుర్​లోని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఆధారాలను సేకరిస్తున్నారు.

పవిత్ర గ్యారాస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని ఖాటూ శ్యామ్​ గుడికి పెద్దఎత్తున భక్తులు పోటెత్తారు. ఉదయం నాలుగున్నర సమయానికే క్యూలైన్లలో బారులు తీరారు. ఆలయం తలుపులు తెరవగానే భక్తులు ఒక్కసారిగా దర్శనం కోసం ఎగబడ్డారు.

దీంతో తొక్కిసలాట జరిగింది. ఆ సమయంలో క్యూలో ఉన్న 63 ఏళ్ళ‌ మహిళ, మరో ఇద్దరు మహిళలు మరణించారు. మృతుల్లో హిసార్​కు చెందిన ఓ మహిళ ఉందని పోలీసులు గుర్తించారు. మిగతా ఇద్దరు మృతులు ఏ ప్రాంతానికి చెందినవారో ఇంకా తెలియలేదు.

మోదీ సంతాపం

కాగా, ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ‘ఖాటూ శ్యామ్‌జీ ఆలయంలో జరిగిన తొక్కిసలాట కారణంగా భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

సీఎం పరిహారం

“సికార్‌లోని ఖాటూ శ్యామ్​జీ ఆలయం వెలుపల జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మరణించడం చాలా బాధాకారం. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.20,000 పరిహారాన్ని అందిస్తాం” అని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ట్వీట్ చేశారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి