
కాన్పూర్: వారపత్రికలో ఓ వ్యాసం కోసం ప్రచురించిన చిత్రంలో శివుడు, కాళీమాతలను అభ్యంతరకర రీతిలో చిత్రీకరించారని హిందూ వాద కార్యకర్తల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో కాన్పూర్ పోలీసులు ఆ పత్రికపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామంతో కలత చెందిన వ్యాసకర్త, ఆర్థికవేత్త వివేక్ దేబరాయ్ ఆ పత్రికతో తన అనుబంధానికి స్వస్తి పలికారు.
హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడు ప్రకాశ్ శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ పత్రిక సంపాదకుడు, యాజమాన్యంపై ఎఫ్.ఐ.ఆర్ దాఖలైంది. కాన్పూర్లోని బడా చౌరాహాలో శుక్రవారం భజరంగ్ దళ్ కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అగ్ని నాలుక పేరుతో జులై 24 సంచికలో ఈ వ్యాసం ప్రచురితమైంది. ఆ వ్యాసకర్త వివేక్ దేబరాయ్ ప్రధాన మంత్రి ఆర్థిక సలహామండలి అధ్యక్షుడిగానూ ఉన్నారు. ఆ చిత్ర ప్రచురణపై పత్రిక యాజమాన్యం తన వెబ్సైట్లో విచారం వ్యక్తం చేసింది.





