
న్యూఢిల్లీ: అధికారం కోసం ప్రజల రాజ్యాంగ హక్కులన్నీ కాలరాస్తూ 47 ఏళ్ళ క్రితం కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. 1975 జూన్ 25వ తేదీ అర్ధరాత్రి ‘అంతర్గత కల్లోల’ స్థితిని ఉద్దేశించి రాజ్యాంగంలో నిర్దేశించిన అధికరణం 352(1)కింద అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర స్థితిని ప్రకటించారు. దేశ సార్వభౌమాధికార మొత్తం తన చేతుల్లోకి తీసుకున్న అత్యంత నియంతృత్వమైన నిర్ణయంగా, చీకటిరోజుగా ప్రజాస్వామ్యవాదులు ఇప్పటికీ ఈ నిర్ణయాన్ని తప్పుపడుతుంటారు.”1975లో ఇదే రోజు కాంగ్రెస్ పార్టీ దేశ పౌరుల హక్కులన్నింటినీ రాత్రికి రాత్రే హరించింది. అత్యవసర పరిస్థితి విధించింది. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు, నియంతృత్వ పోకడలను చిత్తుచేసేందుకు తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన దేశభక్తులందరికీ సెల్యూట్ చేస్తున్నాను” అని అమిత్‌షా శనివారంనాడు ఓ ట్వీట్‌లో అన్నారు.
దేశ చరిత్రలో చీకటి అధ్యాయం
దీనికి ముందు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితులపై స్పందించారు. 47 ఏళ్ల క్రితం నాటి ఎమర్జెన్సీ దేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయమని ఆయన అన్నారు. దీన్ని ఎప్పటికీ మరచిపోలేమని అన్నారు. దానిని దృష్టిలో ఉంచుకుని భారతీయులంతా ప్రజాస్వామ్య పరిరక్షణకు పునరంకింతం కావాలని, రాజ్యాంగం, చట్టబద్ధ సంస్థల ఔన్నత్యాన్ని పరిరక్షిస్తామని ప్రతినబూనాలని కోరారు.





