News

ప్రవక్తపై వ్యాఖ్యలకు ప్రతీకారంగానే కాబుల్‌ దాడి: ఐసిస్‌

523views

ఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో కార్తే పర్వాన్‌ గురుద్వారాపై శనివారం జరిగిన దాడి తమ పనేనని ఐసిస్‌ ఉగ్రసంస్థ ప్రకటించింది.

మహమ్మద్‌ ప్రవక్తపై నూపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు ప్రతీకారంగానే ఈ దాడి జరిపినట్లు పేర్కొంది. ఈ మేరకు ఆఫ్ఘన్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఐసిస్‌ గ్రూప్‌ ఇస్లామిక్‌ స్టేట్‌ ఖొరాసన్‌ ప్రావిన్స్‌ సభ్యులు టెలికాం గ్రూప్ ‌లో పోస్ట్‌ చేశారు. తమ సభ్యుడొకరు హిందూ, సిక్కు సహా వారికి మద్దతిస్తున్న వర్గాలే లక్ష్యంగా దాడికి పాల్పడినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ఓ సెక్యూరిటీ గార్డును కాల్చి తన వద్ద ఉన్న మెషీన్‌ గన్‌, గ్రనేడ్లతో గురుద్వారాలో ఉన్నవారిపై దాడి చేసినట్లు పేర్కొన్నారు.

వరుస బాంబు పేలుళ్లతో కాబుల్‌లోని గురుద్వారా ప్రాంతం శనివారం దద్దరిల్లింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురికి గాయాలయ్యాయి. ఇందులో ఓ తాలిబన్‌ భద్రతా సిబ్బంది, ఓ ఆఫ్ఘన్‌ సిక్కు జాతీయుడు ఉన్నారు. ఉదయం ఆరుగంటల సమయంలో ఉగ్రవాదులు గురుద్వారాలోకి ప్రవేశించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. తొలుత భారీ బాంబు పేలుడు జరిగింది. అరగంట తర్వాత మరో పేలుడుతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలముకుంది. వెంటనే తాలిబన్‌ ప్రభుత్వ భద్రతా దళాలు రంగంలోకి దిగి ఉగ్రవాదులపై దాడి చేశాయి. రెండువైపులా భారీస్థాయిలో కాల్పులు జరిగాయి. దాదాపు కొన్ని గంటల పాటు జరిగిన ఈ భీకరపోరులో తాలిబన్‌ దళాలు, ముగ్గురు తీవ్రవాదులను మట్టుబెట్టాయి. ఈ క్రమంలో గురుద్వారాను పేల్చివేసేందుకు ఉగ్రవాదులు తెచ్చిన కారు బాంబును నిర్వీర్యం చేసి పెను ప్రమాదాన్ని నివారించాయి. దాడిని భారత్‌ తీవ్రంగా ఖండించింది.

మరోవైపు ఈ దాడి నేపథ్యంలో ఆఫ్ఘన్ లోని సిక్కులు, హిందువులను భారత్ కు తీసుకొచ్చే ప్రక్రియను భారత్‌ వేగవంతం చేసింది. ఈ మేరకు 111 ఈ-వీసాలను జారీ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల భాజపా మాజీ అధికార ప్రతినిధులు నుపుర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌ మహమ్మద్‌పై ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకుగానూ దేశవ్యాప్తంగా పెద్దఎత్తున అల్లర్లు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ప్రతి శుక్రవారమూ అల్లరి మూకలు రాళ్ళు రువ్వి నానా యాగీ చేస్తున్నాయి. మరోవైపు ఇస్లామిక్‌ దేశాలన్నీ ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో వెంటనే స్పందించిన భాజపా ఇరువురిని పార్టీ నుంచి బహిష్కరించింది. అలాగే వారు చేసిన వ్యాఖ్యలు భారత ప్రభుత్వ విధానాన్ని ప్రతిబింబించవని కూడా స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.