News

అగ్నిపథ్ నియామకాల‌ వివరాలు విడుదల చేసిన వాయుసేన

414views

భారత వాయుసేన అగ్నిపథ్‌ కింద నియామక వివరాలను నేడు విడుదల చేసింది. ఈ పథకం కింద వాయుసేన నియామక వివరాలు, నిబంధనలు పేర్కొంది.

అగ్నిపథ్ ‌పై ఆందోళనలు చెలరేగిన సమయంలో కేంద్రం దిగివచ్చి పలు రిజర్వేషన్లు, మినహాయింపులు ప్రకటించింది. మరోపక్క దళాలు నియామక ప్రక్రియలను శరవేగంగా మొదలుపెట్టేస్తున్నాయి. ఈ క్రమంలోనే వాయుసేనలో అగ్నిపథ్‌ వివరాలను వెల్లడించింది.

వాయుసేనలో అగ్నిపథ్‌ కింద చేరే అగ్ని వీరుల పర్యవేక్షణ మొత్తం 1950 ది ఎయిర్‌ఫోర్స్‌ యాక్ట్‌ కింద జరుగుతుంది. ఆన్‌లైన్‌ పరీక్షలు, ఇతర విధానాల ద్వారా ఎంపికలు చేపడతారు. ప్రత్యేకమైన ర్యాలీలు, ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఎన్‌ఎస్‌క్యూఎఫ్‌లో గుర్తింపు పొందిన టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూట్లలో క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. వాయుసేనలో ప్రస్తుతం ఉన్న ర్యాంకులకు భిన్నంగా వీరికి ప్రత్యేకమైన ర్యాంక్‌ కేటాయించనున్నట్లు వాయుసేన పేర్కొంది.

ఇక ఎంపికైన అభ్యర్థులు అన్ని నిబంధనలు పాటిస్తామని సంతకాలు చేయాల్సి ఉంటుంది. 18 ఏళ్లలోపు అభ్యర్థులు ఉంటే.. వారి తరపున తల్లిదండ్రులు లేదా గార్డియన్లు సంతకాలు చేయాల్సి ఉంటుంది. అగ్నివీరులకు కూడా పతకాలు, అవార్డులకు అర్హత లభిస్తుంది. వీరికి 30 రోజుల వార్షిక సెలవులు ఉంటాయి. దీంతోపాటు అనారోగ్యం ఆధారంగా సిక్‌లీవ్‌లు లభిస్తాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.