News

గుడిలో గంట‌లు మోగాయ‌ని డీఎంకే కౌన్సిల‌ర్ చిందులు

986views
  • ఆమె అడుగులకు మడుగులొత్తిన‌ హెచ్‌ఆర్‌సీఈ అధికారులు

  • క‌నీస విచార‌ణ లేకుండానే పూజారి స‌స్సెన్ష‌న్‌

చెన్నై: గుడిలోని గంటలు మోగాయ‌ని డీఎంకే కౌన్సిలర్ నైట్‌వేర్‌తో ఆలయంలోకి ప్రవేశించి, చిందులు వేసింది. బహిరంగంగా పూజారిని కించపరిచింది. పూజ సమయంలో గంటలు మోగించొద్దంటూ పూజారిని వేధించినట్టు సమాచారం. హెచ్‌ఆర్‌సీఈ అధికారులు ఆమె ఒత్తిడికి తలొగ్గి, తప్పుడు ఆరోపణలతో పూజారిని తొలగించారు.

తమిళనాడు, సేలంలోని అమ్మపేటైలోని శ్రీ సీతా రామర్ ఆలయ పూజారి కన్నన్ కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకున్నారు. ఆలయంలో గంటలు మోగించడం, పూజలు చేయ‌డాన్ని డీఎంకే స్థానిక కౌన్సిలర్ వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.

కౌన్సిలర్ తనకు మద్దతిచ్చే వారిని బెదిరించడంతో తనతో పాటు భక్తుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని భయాందోళన వ్యక్తం చేశారు. ఆలయ హెచ్‌ఆర్‌సీ అధికారికి తనపై తప్పుడు ఫిర్యాదులు చేసి, తనను ఉద్యోగం నుంచి తొలగించేందుకు ఆమె ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.

అనంతరం ఆలయంలో డీఎంకే కౌన్సిలర్ మంజుల.. పూజారితో పాటు మరికొంత మందితో మాట్లాడుతున్న వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో మంజుల నైట్‌వేర్‌లో పూజారిని అగౌరవపరిచే పదజాలంతో కించపరచడం చూడవచ్చు. భక్తులు వ్యతిరేకించినా ఆమె పూజారిని దూషిస్తూనే ఉంది. ఆమె తన అనుచ‌ర‌గ‌ణంతో పూజారిపై ఫిర్యాదులు చేసినట్టు స్థానికులు అంటున్నారు. ఆమె ఆరోపణలపై ఎలాంటి విచారణ లేకుండానే పూజారిని సస్పెండ్ చేశారు.

రామ నవమి ప్రత్యేక సందర్భం కాబట్టి ఆలయం రాత్రి ఎనిమిది గంటల తర్వాత తెరిచి ఉంటుందని పూజారి తెలిపారు. అప్పుడు కౌన్సిల‌ర్‌ మంజుల తన గూండాలను తీసుకొచ్చి బెదిరించిందని ఆరోపించాడు. తనపై దాడి చేశారని కూడా ఆరోపించారు. అర్ధరాత్రి దాటినా ఆలయాన్ని తెరిచి ఉంచారనే ఆరోపణలను ఆయన ఖండించారు.

తనపై చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్‌సీఈ అధికారిపై కౌన్సిలర్ ఒత్తిడి తెస్తున్నారని పూజారి చెబుతుండగా, ఆలయాన్ని సక్రమంగా నిర్వహించకపోవడం, మహిళా భక్తులతో అనుచితంగా ప్రవర్తించడం, గుడి/పూజ సమయాలు పాటించడం లేదనే ఫిర్యాదులపై తన ఇష్టానుసారం ప్రవర్తించాడని అధికారి చెబుతున్నారు. .

పూజారి అర్ధరాత్రి దాటినా ఆలయాన్ని తెరిచి ఉంచి, రాత్రి 10 గంటల తర్వాత గంటలు మోగించడం వల్ల పాఠశాల, కళాశాల విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగుతుందని కౌన్సిలర్ మంజుల ఆరోపిస్తున్నారు. కౌన్సిలర్ హోదాలో “వార్డు సభ్యుల నుండి వచ్చిన ఫిర్యాదుల” ఆధారంగా గంటలు మోగించవద్దని పూజారిని కోరినట్టు ఆమె చెప్పారు. పూజారి కన్నన్‌పై కూడా “రేషన్ బియ్యాన్ని దాచిపెట్టి, ఆ బియ్యాన్ని ఉపయోగించి చేసిన పొంగల్ ప్రసాదాన్ని భక్తులకు పంచుతున్నారని” ఆమె ఆరోపించింది.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి