
ముంబై: అంచనాలు లేకుండా సంచలన విజయాన్ని సాధించిన చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’. ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూసిన వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. తాజాగా ‘ది కశ్మీర్ ఫైల్స్’ ఓటీటీ రిలీజ్ డేట్‌ను కన్ఫామ్ చేసింది మూవీ యూనిట్. మే 13 నుంచి ఈ సినిమా ‘జీ 5′లో స్ట్రీమింగ్ అవుతుందని తెలిపింది.
హిందీ, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో స్ట్రీమ్ అవుతుందని వివరించింది. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాను వివేక్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు నేతలు ఈ సినిమాని ప్రశంసించిన విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల్లో ఈ మూవీకి ట్యాక్స్ మినహాయింపు కూడా ఇచ్చారు.
యూపీ, కర్ణాటక, గుజరాత్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో ఈ చిత్రానికి ఎంటర్టైన్ మెంట్ ట్యాక్స్ మినహాయించారు. అసొం ప్రభుత్వం అయితే ఈ సినిమా కోసం ఏకంగా తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. 30 ఏళ్ళ కిందట కశ్మీరీ పండితులు పడిన బాధలను కళ్ళకు కట్టినట్టు చూపించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనమైంది.





