News

ఇమ్రాన్‌కు `సుప్రీం’లో చుక్కెదురు… తిరిగి అవిశ్వాస తీర్మానం!

556views

ఇస్లామాబాద్‌: ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం నుండి తప్పించుకోవడం కోసమై డిప్యూటీ స్పీకర్‌తో తిరస్కరింప చేసి, వెంటనే అధ్యక్షుడితో జాతీయ అసెంబ్లీని రద్దు చేయించి, మూడు నెలల్లో తాజా ఎన్నికలకు సిద్ధపడిన ఇమ్రాన్ ఖాన్‌కు పాకిస్థాన్ సుప్రీం కోర్టులో భంగపాటు ఎదురైంది.

ఇప్పటికే మూడు నెలల్లో ఎన్నికలు జరపడం సాధ్యం కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేయగా, ఆయనపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ ఖాసిం సురీ తిరస్కరించడం రాజ్యాంగ విరుద్ధమని ఇప్పుడు సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఈ నెల మూడోతేదీన‌ సురీ తిరస్కరించారు.

అవిశ్వాస తీర్మానం వెనక విదేశీ కుట్ర ఉందని ఇమ్రాన్ ఆరోపించారు. ఆ వెంటనే ఇమ్రాన్‌ సూచన మేరకు పాక్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు. ఈ నిర్ణయాలను సవాలు చేస్తూ ప్రతిపక్షాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. చీఫ్‌ జస్టిస్‌ ఉమర్‌ అటా బందియాల్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం..ఈ అంశంపై నాలుగు రోజులుగా విచారణ జరుపుతోంది.

డిప్యూటీ స్పీకర్‌ ఖాసిం సురీ ఆర్టికల్‌ 95ను ఉల్లంఘించినట్లు స్పష్టమైందని గురువారం రాత్రి చీఫ్‌ జస్టిస్‌ స్పష్టం చేశారు. ఆయన నిర్ణయం.. అలాగే అధ్యక్షుడు జాతీయ అసెంబ్లీని రద్దు చేయడం కూడా రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పునిచ్చింది. జాతీయ అసెంబ్లీని పునరుద్ధరించాలని ఆదేశించింది. సభను రద్దు చేయాలంటూ ఇమ్రాన్‌ ఖాన్‌ అధ్యక్షుడికి సిఫారసు చేయడం కూడా రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.

ఈ నెల 9న (శనివారం) ఉదయం 10 గంటలకు జాతీయ అసెంబ్లీని సమావేశపరిచి అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించాలని స్పీకర్‌ను ఆదేశించింది. మరోవైపు పాకిస్థాన్‌ ఎన్నికల సంఘం కార్యదర్శికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేయగా.. న్యాయనిపుణుల బృందంతో కలిసి ఆయన కోర్టుకు హాజరయ్యారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి