
* 2070 నాటికి కర్బన ఉద్గార రహితంగా దేశాన్ని మార్చడమే లక్ష్యం… వెల్లడించిన ప్రధాని మోడీ
పునరుత్పాదక ఇంధన వనరులున్న భారత్, హరిత హైడ్రోజన్ కు ప్రపంచ హబ్ గా మారగలదని ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. సుస్థిర ఇంధన వనరులతో మాత్రమే సుస్థిరాభివృద్ధి సాధ్యమని.. ‘సుస్థిరాభివృద్ధికి ఇంధనం’ అనే అంశంపై జరిగిన వెబినార్‌లో ప్రధాని వెల్లడించారు. హైడ్రోజన్ పర్యావరణ వ్యవస్థ ఎరువులు, శుద్ధి కర్మాగారాలు, రవాణా రంగంతో సంబంధం కలిగి ఉన్నదన్నారు. ఇందులోకి ప్రవేశించే ప్రైవేట్ రంగానికి అవసరమైన ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందజేస్తుందని హామీ ఇచ్చారు.
సుస్థిర ఇంధన వనరుల అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు లక్ష్యాలను విధించుకున్నదని ప్రధాని పేర్కొన్నారు. 2070 నాటికి కర్బన ఉద్గారాలను సున్నా స్థాయికి తీసుకురావడం, 2030 నాటికి మృత్తికేతర విద్యుత్ సామర్థ్యాన్ని 500 గిగావాట్లు సాధించడం, మన విద్యుత్ ఉత్పత్తిలో సగం మృత్తికేతర వనరుల ద్వారా పొందడం లక్ష్యమని వివరించారు. సౌర విద్యుత్ ఉత్పత్తికి అవసరమయ్యే మాడ్యూళ్ల తయారీకి బడ్జెట్‌లో రూ.19,500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇథనాల్ ఉత్పత్తిని పెంచేందుకు చక్కెర మిల్లులను ఆధునీకరిస్తున్నామన్నారు. ఈ దిశగా ఎదురయ్యే సవాళ్లను మనం అవకాశాలుగా మార్చుకుంటున్నామని పేర్కొన్నారు. వెబినార్‌లో విదేశాంగ, పెట్రోలియం, సహజవాయువు, పర్యావరణ శాఖల మంత్రులు పాల్గొన్నారు.





