News

పాకిస్తాన్, బంగ్లాదేశ్ హిందువులకు హౌసింగ్ ప్లాట్లు

517views
  • ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్ల‌డి

ల‌క్నో: ఆక్రమణదారుల నుంచి ప్రభుత్వం విడిపించిన భూమిలో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చిన హిందువులకు వసతి కల్పిస్తున్నట్టు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం ధ్రువీకరించారు. “పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి బహిష్కరణకు గురైన తరువాత దశాబ్దాలుగా మీరట్‌లో నివసిస్తున్న హిందువులు తమ సొంత ఇళ్ళు నిర్మించుకోవడానికి, భూములు కొనడానికి స్తోమత లేదు. మేము అలాంటి 63 బెంగాలీ హిందూ కుటుంబాలకు కాన్పూర్ దేహత్‌లో ఇళ్ళ కోసం రెండు ఎకరాల భూమి, ప్లాట్లు ఇచ్చాము. ఈ భూములు భూకబ్జాదారుల నుంచి విముక్తి పొందినవేనని” అని ఆయన అన్నారు.

బంగ్లాదేశ్‌లో హింసించబడిన తరువాత భారతదేశానికి చేరుకున్న 63 బెంగాలీ హిందూ కుటుంబాలకు, దశాబ్దాలుగా కాన్పూర్ దేహత్ ప్రాంతంలో నివసిస్తున్న వారికి కూడా ‘ముఖ్యమంత్రి ఆవాస్ యోజన’ కింద రూ.1.20 లక్షలు అందించామన్నారు.

‘ఆక్రమణదారుల నుండి తీసుకున్న భూమిని ల్యాండ్ బ్యాంక్ కిందకు తీసుకువచ్చారు. పాఠశాలలు, పరిశ్రమలు, ఇతర వ్యాపారాలను స్థాపించడానికి కూడా భూమిని వినియోగిస్తారు. ఈ రికవరీ భూముల్లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ లాంటి అనేక సౌకర్యాలు కూడా నిర్మించబడ్డాయి’ అని యోగి ఆదిత్య‌నాథ్ తెలిపారు.

1970లో తూర్పు పాకిస్తాన్ నుండి వలస వచ్చి ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ లో ఉన్న 63 హిందూ బెంగాలీ కుటుంబాలకు పునరావాసం కల్పిస్తామని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నవంబర్ 2021లో ప్రకటించిన తర్వాత ఇది జరిగింది. రాష్ట్ర మంత్రివర్గం కూడా వారికి ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది.

రైతుల‌కు విద్యుత్ బిల్లుల్లో 50 శాతం రాయితీ

ఇక రాష్ట్రంలోని రైతులకు విద్యుత్ బిల్లుల్లో 50 శాతం రాయితీని ప్రకటించారు యోగి ఆదిత్యనాథ్. దీని వల్ల యూపీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (యూపీపీసీఎల్)పై ప్రతి ఏడాది దాదాపు రూ.1,000 కోట్ల అదనపు భారం పడనుంది. ఇందుకోసం యూపీపీసీఎల్‌కు ప్రభుత్వం గ్రాంట్లు ఇస్తుంది. విద్యుత్ రేటులో మినహాయింపును సీఎం యోగి ప్రకటించారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

ప్రభుత్వం నుంచి గ్రాంట్ రాగానే ప్రస్తుత విద్యుత్ రేటును సవరిస్తారు. ప్ర‌స్తుత నిర్ణ‌యంతో గ్రామీణ ప్రాంతాల్లోని మీటర్ల కనెక్షన్లలో యూనిట్ కు రూ.2 నుంచి రూ.1కి తగ్గనుండగా.. ఫిక్స్ డ్ చార్జీ రూ.70 నుంచి రూ.35కి తగ్గనుంది. మరోవైపు, మీటర్‌లెస్ విద్యుత్ కనెక్షన్‌లపై ఫిక్స్‌డ్ ఛార్జీ రూ.170 నుంచి రూ.85కి తగ్గనుంది. ఇంధన ఆదా చేసే పంపులకు గతంలో 1.65 యూనిట్లకు రూ.70 ఫిక్స్‌డ్ చార్జీ చెల్లించాల్సి ఉండగా, ఇప్పుడు రూ.35కి తగ్గనుంది. ఈ కొత్త ప్రకటన తర్వాత యూనిట్‌కు 0.83 పైసలు అవ్వనుంది. నగరాల్లోని ప్రైవేట్ క‌నెక్ష‌న్‌ల‌కు యూనిట్‌కు 6 నుంచి రూ.3కు త‌గ్గ‌నుంది. సీఎం యోగి ప్రకటనతో రాష్ట్రంలోని 13 లక్షల మంది ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరనుంది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి