
న్యూఢిల్లీ: త్వరలోనే భారత్‌లో స్వదేశీ విధానంలో తయారు చేసిన 6జీ వ్యవస్థ అందుబాటులోకి రానుందని కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. 2023 చివరికి లేదా 2024 ప్రారంభంలో స్వదేశీ 6జీ వ్యవస్థ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఒక వెబినార్‌లో ఆయన పేర్కొన్నారు.
“6జి సాంకేతికతను అభివృద్ధి చేసే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అది 2024 లేదా 2023-చివరి కాలంలో కనిపిస్తుంది. ఆ దిశగానే మనం వెళ్తున్నాం. నెట్‌వర్క్‌లను అమలు చేయడానికి మనం భారతదేశంలోనే టెలికాం సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాము. అంతర్జాతీయ ప్రమాణాలతో భారతదేశంలో తయారు చేసిన టెలికాం పరికరాలు, భారతదేశం టెలికాం నెట్‌వర్క్‌లలో సేవలందించవచ్చు. ఇక్కడి నుండి అవి ప్రపంచంపై కూడా అందుబాటులోకి వస్తాయి” అని కేంద్ర మంత్రి వివరించారు.
‘న్యూ టెక్నాలజీ అండ్ ది గ్రీన్ ఎకానమీ: టూ ట్రెండ్స్ షేపింగ్ ఎ న్యూ ఇండియా?’ అనే అంశంపై ఫైనాన్షియల్ టైమ్స్ . ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నిర్వహించిన ఆన్‌లైన్, ఎజెండా-సెట్టింగ్ వెబ్‌నార్ సిరీస్‌లో నాలుగో కార్యక్రమంలో పాల్గొంటూ అవసరమైన అనుమతులు ఇప్పటికే ఇచ్చిన్నట్టు చెప్పారు.
అలాగే వచ్చే ఏడాదిలోనే 5జీని లాంచ్ చేయనున్నట్టు తెలిపారు. వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలో అంటే మార్చి తర్వాత 5జీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 5జీ స్పెక్ట్రమ్ వేలం గురించి కూడా అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ ఈ విషయంలో ఇప్పటికే ట్రాయ్ (టీఆర్‌ఏఐ) పలు కంపెనీలతో సంప్రదింపులు ప్రారంభించిందని, ఈ చర్చలు వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నాటికి ముగుస్తాయని వెల్లడించారు.





