
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులను భద్రతాబలగాలు చావుదెబ్బ తీశాయి. పూల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఆరుగురు ఉగ్రవాదులను పట్టుకున్నారు. పూల్వామాలోని త్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు భద్రతాబలగాలకు నిఘావర్గాల నుంచి పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన సీఆర్పీఎఫ్, ఆర్మీ, పోలీసుల సంయుక్త బలగాలు త్రాల్ లో ఉగ్రవాదులు నక్కిన ఇంటిని చుట్టుముట్టాయి. అయితే బలగాల కదలికలను పసిగట్టిన ఉగ్రవాదులు, ఎదురు కాల్పులకు దిగారు. వెంటనే అప్రమత్తమయిన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఆరుగురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. మరోవైపు ఘటనాస్థలం నుంచి తప్పించుకున్న ఉగ్రవాదులు, భద్రతాబలగాల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. సంఘటన స్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.
Source : Bharath Today.





