News

దక్షిణాఫ్రికాలో గాంధీజీ ఆశ్రమం పునరుద్ధరణ

369views
  • భారత ప్రభుత్వం భారీ విరాళం

జొహన్నెస్‌బర్గ్‌: మహాత్మా గాంధీ దాదాపు వందేళ్ళ కిందట జొహన్నెస్‌బర్గ్‌లో ప్రారంభించిన టాల్‌స్టాయ్‌ ఆశ్రమ పునరుద్ధరణ కొనసాగుతోంది. గాంధీ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం విరాళాలు ఇవ్వడంతో ఈ కార్యక్రమం వేగం పుంజుకుంది. ముఖ్య అతిథులుగా భారత హై కమిషనర్‌ జైదీప్‌ సర్కార్‌, కాన్సుల్‌ జనరల్‌ అంజు రంజన్‌ హాజరయ్యారు. టాల్‌స్టాయ్‌ ఫామ్‌ను దశాబ్దాల కిందట ధ్వంసం చేశారు.

గాంధీజీ ఇంటి పునాదులు మాత్రమే మిగిలాయి. దీనిని పునరుద్ధరించి, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు గాంధేయవాది మోహన్‌ హీరా చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. మోహన్‌ ఈ ఫామ్‌ పునరుద్ధరణ కోసం మహాత్మా గాంధీ రిమంబ్రెన్స్‌ ఆర్గనైజేషన్‌(ఎంజీఆర్‌ఓ)ను ఏర్పాటు చేశారు. భారత ప్రభుత్వం, విదేశాల్లోని భారతీయులు అందిస్తున్న నిధులతో దీనిని పునరుద్ధరిస్తున్నారు. టాల్‌స్టాయ్‌ ఫామ్‌ పునరుద్ధరణ తొలి దశలో ఈ ఫామ్‌తోపాటు, దాని పరిసరాల్లో పెకన్‌ నట్‌, ఆలివ్‌ ట్రీస్‌ను నాటుతున్నారు. విద్యుత్తు సరఫరా కోసం జనరేటర్‌ను ఇండియన్‌ మిషన్స్‌ అందజేశాయి.

భద్రత, నిర్వహణల కోసం నెలవారీ విరాళాలను ఇండియా క్లబ్‌ ఇస్తోంది. జైదీప్‌ సర్కార్‌ మాట్లాడుతూ, టాల్‌స్టాయ్‌ ఫామ్‌ పునరుద్ధరణ కోసం భారత ప్రభుత్వ సహకారం కొనసాగుతుందని చెప్పారు. ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు సందర్శించేందుకు అనువుగా దీనిని తీర్చిదిద్దాలన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో ఉపయోగించిన కొన్ని పద్ధతుల రూపకల్పన ఇక్కడే జరిగిందన్నారు. అంజు రంజన్‌ మాట్లాడుతూ, ఎంజీఆర్‌ఓ సేవలను ప్రశంసించారు. గాంధీజీ ఇంటి నమూనాను అభివృద్ధి చేయడానికి మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించినందుకు అభినందించారు. ఈ కార్యక్రమానికి సహకరించాలని దక్షిణాఫ్రికాలోని భారత సంతతి ప్రజలను కోరారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి