
-
కాల్పుల వరకు వెళ్ళిన వ్యవహారం
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్‌ను మరోసారి తమ నియంత్రణలోకి తెచ్చుకున్న తాలిబన్‌లోని రెండు వర్గాల మధ్య విభేదాలు ఇటీవల కాల్పుల వరకు వెళ్లిన్నట్టు నిర్ధారణ అవుతున్నది. తాలిబన్ సహ వ్యవస్థాపకుడు, తాత్కాలిక ప్రభుత్వంలోని డిప్యూటీ ప్రధాని అయిన ముల్లా అబ్దుల్ ఘనీ బరదార్, హక్కానీ నెట్‌వర్క్‌ల మధ్య ఎలాంటి విబేధాలు లేవని, వారి మధ్య ఘర్షణలు జరగలేదని తాలిబన్లు పదే పదే ఖండిస్తున్నా ఘర్షణలు జరిగిన్నట్టు స్పష్టం అవుతున్నది.
బరదార్‌ను హక్కానీ నెట్‌వర్క్ ప్రముఖ నేత ఖలీల్ ఉల్ రహమాన్ హక్కానీ కొట్టాడు. తన సీటు నుంచి లేచిన హక్కానీ, బరదార్ వద్దకు వెళ్లి పంచ్‌లిచ్చాడు. కాబూల్‌లోని అధ్యక్షుడి భవనంలో ఈ నెల మొదట్లో జరిగిన ఈ ఘటన, రెండు వర్గాల మధ్య కాల్పులకు దారి తీసిందని బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది.
అమెరికా అండతో పాకిస్థాన్ జైలు నుంచి విడుదలైన బరదార్, దోహాలోని తాలిబన్ రాజకీయ కార్యాలయానికి అధిపతిగా ఉన్నాడు. ఆఫ్ఘన్ నుంచి అమెరికా దళాల ఉపసంహరణకు సంబంధించిన కీలక శాంతి చర్చల్లో పాల్గొన్న ఆయన ఈ మేరకు అమెరికాతో కుదిరిన ఒప్పందంపై సంతకాలు చేశాడు.
ఆఫ్ఘనిస్థాన్ మరోసారి తాలిబన్ల నియంత్రణలోకి రావడానికి తన రాజకీయ చర్చలే కీలకంగా గుర్తించాలని డిమాండ్ చేశాడు. ఆయనే ప్రధాని కానున్నట్టు తొలుత వార్తలు వచ్చాయి. అయితే, ఆయన పాకిస్థాన్ వ్యతిరేకిగా, భారత్ అనుకూలుడిగా పేరొందడంతో ఐఎస్‌ఐ జోక్యం చేసుకొని అంతగా తెలియని, పాక్ అనుకూలుడైన ముల్లా మహమ్మద్ హసన్ తాత్కాలిక ప్రధానిగా అయ్యేటట్టు చూసిందని చెబుతున్నారు.
అంతర్జాతీయ సమాజానికి మరింత ఆమోదయోగ్యమైన అన్ని వర్గాలను కలుపుకొని క్యాబినెట్ ఏర్పాటు, ప్రభుత్వ నిర్మాణం గురించి బరదార్ స్పష్టం చేశాడు. అయితే, అటువంటి చర్చ పట్ల ఆగ్రహించిన మంత్రి ఖలీల్ ఉల్ రహమాన్ హక్కానీ తన సీటు నుంచి లేచి వచ్చి బరదార్‌ను కొట్టడం ప్రారంభించాడని, దీంతో బరదార్, హక్కానీ బాడీ గార్డులు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకొన్నారని దీని గురించి తెలిసిన వారు చెప్పినట్టు బ్లూమ్‌బెర్గ్ తెలిపింది.
ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన కొందరు చనిపోగా మరి కొందరు గాయపడినట్టు వివరించింది. ఈ కాల్పుల్లో బరదార్ చనిపోవడం లేదా గాయపడినట్టు వదంతులు వ్యాపించాయి. అయితే, బరదార్‌కు ఏమీ కాలేదని, ఈ పరిణామం అనంతరం తాలిబన్ సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుంజాదాతో మాట్లాడటానికి ఆయన కాబూల్‌ను వీడి కాందహార్‌కు వెళ్లారని ఆ నివేదిక పేర్కొంది.
ఈ ఘటన నేపథ్యంలో తాలిబన్ తాత్కాలిక ప్రభుత్వం నుంచి బరదార్ తప్పుకున్నారనే కథనాలు వెలువడుతున్నాయి. అయితే, తాను బతికే ఉన్నట్టు బరదార్ ఒక ఆడియో సందేశాన్ని విడుదల చేశాడు. దీనిని నిరూపించేందుకు అధికార టీవీలో ఆయన కనిపించాడు. తమ మధ్య అంతర్గత విభేదాలు ఉన్నట్టుగా వచ్చిన వార్తలు అవాస్తవమని అన్నాడు.
కాగా, 2016లో తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్ కలిసిపోయాయి. తాలిబన్ తాత్కాలిక ప్రభుత్వంలో హక్కానీ గ్రూప్‌కు నాలుగు కీలక పోస్టులు లభించాయి. నిషేధిత ఉగ్రవాదిగా అమెరికా ముద్ర వేసిన సిరాజుద్దీన్ హక్కానీని తాత్కాలిక అంతర్గత మంత్రిగా నియమించారు.
Source:Nijamtoday





