బంగ్లాదేశ్ ఏర్పాటులో.. భారత్ విజయానికి 50 ఏళ్లు.. స్వర్ణిమ్ విజయ్ వర్ష్ పేరుతో ఏడాదిగా ఉత్సవాలు.. విశాఖ చేరుకున్న ఉత్సవ జ్యోతి..

భారత రక్షణ దళాల ధీరోదాత్త పోరాటాల ఫలితంగా 1971లో భారతదేశం పాకిస్థాన్‌పై విజయం సాధించింది. బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం రావడానికి పూర్తి సహకారం అందించింది. ఆ యుద్ధం జరిగి 50 ఏళ్లవుతున్న నేపథ్యంలో ప్రస్తుత సంవత్సరాన్ని ‘స్వర్ణిమ్ విజయ్ వర్ష్’గా ప్రకటించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గత సంవత్సరం డిసెంబరు 16న దిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద ‘ఎటర్నల్ ఫ్లేమ్’ నుంచి నాలుగు విజయ జ్యోతులు వెలిగించారు. ఆ జ్యోతులను దేశంలోని నాలుగు దిక్కులకు పంపారు. దక్షిణ భారతదేశం వచ్చిన విజయ జ్యోతి వివిధ ప్రాంతాలు తిరుగుతూ విశాఖ చేరుకుంది.
అండమాన్ పోర్ట్ బ్లెయిర్‌లోని ఐఎన్ఎస్ సుమిత్ర నుంచి విశాఖపట్నం వచ్చిన విజయజ్యోతిని తూర్పునౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ ఎబీ సింగ్ తో కలిసి రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత అందుకున్నారు. ఈ సందర్భంగా బీచ్ రోడ్లో విక్టరీ ఎట్ సీ వద్ద జరిగిన కార్యక్రమంలో తూర్పునౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్.. అమర వీరులకు అంజలి ఘటించారు. 1971వ సంవత్సరంలో జరిగిన యుద్ధంలో పాల్గొన్న యుద్ధవీరుల్లో విశాఖ నగరం, పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న సుమారు 30 మంది ఉన్నారు. యుద్ధ అనుభవాల్ని తెలుసుకోవడానికి వారితో ఉన్నతాధికారులు భేటీ ఏర్పాటుచేశారు.
నగరంలోని వివిధ పాఠశాలలకు కూడా ఈ విజయ జ్యోతి తీసుకు వెళతారు. కిశోర బాల బాలికల్లో ఆనాటి విజయ స్ఫూర్తిని గురించి అవగాహన కల్పిస్తారు. జ్యోతి హైదరాబాద్‌కు తీసుకెళ్లేటప్పుడు మార్గంలో స్వర్ణ విజయ వర్ష్ కార్యక్రమాలను రాజమండ్రి, విజయవాడ, నల్గొండలలో నిర్వహిస్తారు.





