News

కవ్విస్తున్న చైనా

348views

వాస్తవాధీన రేఖ వెంబడి శాంతియుత వాతావరణాన్ని కల్పించేందుకు దౌత్య మార్గాల్లో భారత్ చర్చలకు యత్నిస్తున్నా చైనా కవ్వింపులు ఆగడం లేదు. తరచూ వివాదాస్పద ప్రాంతంలోకి చైనా బలగాలు చొచ్చుకొస్తూనే ఉన్నాయి. తాజాగా దెమ్ చోక్‌లోని చార్‌డింగ్‌ నాలా వద్ద ఆ దేశం గుడారాలను వేసినట్టు సమాచారం. భారత సైన్యం అక్కడి వారిని ప్రశ్నించగా చైనా పౌరులమని చెప్పినట్లు తేలింది. సైన్యం వాళ్లను అక్కడి నుంచి ఖాళీచేసి వెళ్లిపొమ్మని హెచ్చరించినా.. వారు అక్కడే కొనసాగుతున్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ రోజు కోర్‌ కమాండర్ల స్థాయి సమావేశం జరగాల్సి ఉంది. కార్గిల్‌ యుద్ధ విజయ దినోత్సవ కార్యక్రమాల వల్ల భారత్‌ ఈ సమావేశాలను వాయిదా వేసింది. అదే సమయంలో ఈ గుడారాలు ప్రత్యక్షం కావడం గమనార్హం.

1990ల్లో ఏర్పాటు చేసిన ఇండో చైనా జాయింట్‌ వర్కింగ్‌ గ్రూప్‌ దెమ్‌చోక్‌, ట్రిగ్‌ హైడ్స్‌లను వివాదాస్పద ప్రాంతాలుగా గుర్తించింది. వాస్తవాధీన రేఖ వెంట ఉద్రిక్తత పెరగడంతో ఇటీవల భారత్‌ నార్తన్‌ కమాండ్‌లోని ఉగ్రవాద వ్యతిరేక దళాలను వాస్తవాధీన రేఖ వద్దకు తరలించింది. సరిహద్దులకు దళాల చేరవేత జరగుతున్నా ఇరుపక్షాలు ముఖాముఖిన తలపడే ఉద్రిక్తత లేదని అధికారులు చెబుతున్నారు. దౌలత్‌ బేగ్‌ ఓల్డీ, చుసుల్ వద్ద ఏర్పాటు చేసిన హాట్‌లైన్ల ద్వారా చైనా దళాలతో వివిధ అంశాలపై సంప్రదింపులు, సమన్వయం జరగుతోందని భారత అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.