మా ప్రధానివి అసందర్భ ప్రేలాపనలు – లాడెన్ అమరవీరుడన్న పాక్ ప్రధాని వ్యాఖ్యలపై ఆ దేశ విదేశాంగ మంత్రి

అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను అమరవీరుడంటూ పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కీర్తించడంపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు రావడంతో తేరుకున్న పాకిస్థాన్.. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నోరుజారి అలా వ్యాఖ్యానించారని పేర్కొంది. బిన్ లాడెన్‌ను ఉగ్రవాదిగానే చూస్తున్నామన్న పాకిస్థాన్.. మరోసారి కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేసింది.
పాకిస్థాన్ పార్లమెంట్‌లో ప్రసంగించిన ఇమ్రాన్ ఖాన్.. ఒసామా బిన్ లాడెన్‌ను చంపేందుకు అమెరికా బలగాలు పాక్‌లో చేపట్టిన ఆపరేషన్‌ను ప్రస్తావించారు. పాకిస్థాన్‌కు సమాచారం ఇవ్వకుండానే ఇక్కడి గగనతలంలో అడుగుపెట్టి బిన్ లాడెన్‌ను చంపి అమరుడిని చేశారని వ్యాఖ్యానించారు. ఆ సందర్భంలో పాకిస్థాన్ చాలా ఇబ్బంది పడిందని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. అయితే, ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో పాకిస్థాన్‌పై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనిపై తొలుత ఓ ఇంటర్వ్యూలో స్పందించిన పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మూద్ ఖురేషీ.. ఇమ్రాన్ వ్యాఖ్యలు అసందర్భమైనవని అన్నారు. ఓ వర్గం మీడియా వాటిని తప్పుగా చూపించేందుకు ప్రయత్నించాయని చెప్పారు. తాజాగా పాకిస్థాన్ సమాచార, సాంకేతిక వ్యవహారాలశాఖ మంత్రి ఫవాద్ చౌధురి కూడా ఇమ్రాన్ వ్యాఖ్యలపై స్పందించారు. ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నోరుజారి అలా మాట్లాడారని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు.





