
పశ్చిమ బెంగాల్లోని క్రైస్తవ మిషనరీ పాఠశాలల్లో బలవంతపు మతమార్పిడులు, భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని బెంగాల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య స్పష్టం చేశారు. మత ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే బలవంతంగా లేదా ప్రలోభాల ద్వారా మతమార్పిడులకు పాల్పడితే మాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు.
ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన అసన్సోల్లోని కొన్ని క్రైస్తవ మిషనరీ సంస్థలు మతమార్పిడులను ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. పాఠశాలలు నిర్వహించే సంస్థలైనా సరే, చట్టవిరుద్ధమైన మతమార్పిడులకు పాల్పడితే చర్యలు తప్పవని వ్యాఖ్యానించారు.
కాషాయ వస్త్రధారణపై అభ్యంతరాలా?
కోల్కతాలోని ఓ ప్రముఖ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాలిని కాషాయ రంగు చీర ధరించకుండా అడ్డుకున్నారని భట్టాచార్య ఆరోపించారు. అదే పాఠశాలలో విద్యార్థులను శ్రీకృష్ణుడి పేరును ప్రస్తావించవద్దని హెచ్చరించినట్లు కూడా పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఇది మొఘల్ చక్రవర్తి బాబర్ ప్రభుత్వం కాదు” అని వ్యాఖ్యానించారు. విద్యాసంస్థల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు గౌరవం ఉండాలని అభిప్రాయపడ్డారు.
ఆధారాలు చూపించాలని క్రైస్తవ సంస్థల డిమాండ్
మరోవైపు, ‘బంగియా క్రిస్టియా పరిసేవ’, ‘వెస్ట్ బెంగాల్ అసోసియేషన్ ఆఫ్ క్రిస్టియన్ స్కూల్స్’ అనే రెండు క్రైస్తవ సంస్థలు భట్టాచార్య వ్యాఖ్యలను ప్రశ్నించాయి. దేశవ్యాప్తంగా ముస్లింలు, క్రైస్తవులు వంటి మతపరమైన మైనారిటీలను వేధించేందుకు మతమార్పిడి ఆరోపణలను ఉపయోగిస్తున్నారని విమర్శించాయి. మతమార్పిడులకు సంబంధించిన ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలని బీజేపీ నాయకుడిని డిమాండ్ చేశాయి.
ప్రతిపక్షాల విమర్శలు
భట్టాచార్య వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డోలా సేన్, కాంగ్రెస్ నాయకురాలు సౌమ్య హెచ్. రాయ్ సహా పలువురు ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పించారు. సీపీఐ(ఎం) నాయకుడు సుజన్ చక్రవర్తి ఈ వ్యాఖ్యలను రాజ్యాంగంపై, విద్యారంగంపై ఉద్దేశపూర్వక దాడిగా అభివర్ణించారు.





