
సరిహద్దుల వెంట గల్వాన్.. ఇతర ప్రాంతాల్లో జరిగిన ఘటనలతో చైనా సైన్యం బలహీనతలు తెలిశాయని భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. చైనా సైనికులకు తగిన శిక్షణ, సన్నద్ధత లేదని తేలిపోయినట్లు వ్యాఖ్యానించారు. ఆయన ఒక ఆంగ్ల వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా సైనికులు స్వల్పకాలానికి మాత్రమే దళాల్లో చేరతారని పేర్కొన్నారు. దీంతో హిమాలయా పర్వత ప్రాంతాల్లో పోరాడేందుకు వారికి తగినంత అనుభవం, శిక్షణ లభించదని రావత్ పేర్కొన్నారు.
‘‘గల్వాన్, ఇతర ఘర్షణల తర్వాత వాస్తవాధీన రేఖ వెంట ఉన్న చైనా దళాల్లో కీలక మార్పులు చోటు చేసుకొంటున్నాయి. ఆ ఘర్షణల తర్వాత మెరుగైన శిక్షణ, సన్నద్ధత అవసరమనే నిజం వారికి తెలిసొచ్చింది. అక్కడ సైనికులుగా సాధారణ పౌరులను తీసుకొంటారు. వారు స్వల్పకాలానికి మాత్రమే పనిచేస్తారు. దీంతో ఇలాంటి పర్వత ప్రాంతాల్లో విధి నిర్వహణకు చైనా ఇచ్చే శిక్షణ సరిపోదు. టిబెట్ భౌగోళికంగా చాలా కష్టమైంది. ఇక్కడ పనిచేయాలంటే ప్రత్యేక శిక్షణ ఉండాలి. వాతావరణానికి అలవాటు పడాలి. భారత సైనికులు ఈ ప్రాంత వాతావరణానికి తేలికగా అలవాటు పడతారు. మన దళాలు పలు పర్వత ప్రాంతాల్లో నిరంతరం పనిచేస్తుంటాయి. కానీ, చైనా అలాకాదు. ఆ దేశ కదలికలపై భారత్ నిఘా వేసి ఉంచింది’’ అని రావత్ పేర్కొన్నారు.





