
అమెరికాలోని భారత సంతతి జర్నలిస్టు మేఘ రాజగోపాలన్‌కు ప్రతిష్ఠాత్మక పులిట్జర్ పురస్కారం లభించింది. బజ్‌ఫీడ్ న్యూస్ సంస్థలో పని చేస్తున్న మేఘా రాజగోపాలన్ చైనాలోని షింజియాంగ్ ప్రాంతంలో మైనార్టీలపై జరుగుతున్న అకృత్యాలను వెలుగులోకి తీసుకొచ్చారు. చైనా దేశంలో నిర్వహిస్తున్న నిర్బంధ శిబిరాలను వ్యక్తిగతంగా పరిశీలించిన తొలి జర్నలిస్టు మేఘానే కావడం గమనార్హం. ఆ వివరాలను బజ్‌ఫీడ్ సంస్థ వెల్లడించింది. చైనా మేఘ నోరు నొక్కేందుకు యత్నించిందని.. కానీ ఆమె పట్టుదలతో లండన్ నుంచి తన పరిశోధనను కొనసాగించిందని వెల్లడించింది. ముస్లింలపై చైనా ప్రభుత్వ దారుణాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు మేఘా నిర్విరామ కృషిచేసిందని వెల్లడించింది. వార్తాపత్రిక, ఆన్‌లైన్ జర్నలిజం, సాహిత్యం, సంగీత కూర్పులలో ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారాన్ని మేఘా రాజగోపాలన్ మరో ఇద్దరితో కలిసి గెలుచుకున్నారు.





