News

నిజాలు తెలుసుకోకుండా తప్పుడు వాదనలు చెయ్యకండి : బ్రిటన్ కు భారత్ తీవ్ర హెచ్చరిక

811views

భారత్‌లో శాంతియుత ఆందోళనలు, మీడియా స్వేచ్ఛపై బ్రిటన్‌ పార్లమెంట్‌ చేపట్టిన డిబేట్‌ వివాదానికి దారితీసింది. ఈ చర్చను భారత్‌ తీవ్రంగా ఖండించింది. వాస్తవాలు తెలుసుకోకుండా ఏకపక్షంగా డిబేట్‌ నిర్వహించారని దుయ్యబట్టింది. అసలేం జరిగిందంటే..

భారత ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత 100 రోజులుగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు సాగిస్తున్న ఉద్యమానికి అంతర్జాతీయ మద్దతు లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో ఆందోళనకారుల భద్రత, మీడియా స్వేచ్ఛపై బ్రిటిష్‌ పార్లమెంట్‌లో సోమవారం 90 నిమిషాల పాటు డిబేట్‌ జరిగింది. ఈ చర్చలో పలు బ్రిటిష్‌ పార్టీలకు చెందిన ఎంపీలు పాల్గొని నిరసనకారులు, జర్నలిస్టుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళనల కవరేజీ విషయంలో మీడియా ప్రతినిధులకు స్వేచ్ఛ లేదని ఆరోపించారు. ఇరు దేశాల ప్రధానులు ముఖాముఖీగా కలుసుకున్నప్పుడు యూకే ఈ అంశాలను లేవనెత్తుతుందని ఆ దేశ మంత్రి నీగెల్‌ ఆడమ్స్‌ వెల్లడించారు.

”రైతుల ఆందోళన, ఈ అంశంపై మీడియా కవరేజీపై నెలకొన్న అనిశ్చితి భారత మూలాలున్న బ్రిటిష్‌ కమ్యూనిటీల్లో ఆందోళన కలిగిస్తోంది. మరికొద్ది నెలల్లో బోరిస్‌ జాన్సన్‌ భారత పర్యటన సందర్భంగా ఈ అంశాన్ని ఆ దేశ ప్రధాని మోదీతో చర్చించే అవకాశముంది. అయితే ఆలోగా భారత ప్రభుత్వం, రైతు సంఘాలు మధ్య చర్చలు ఫలిస్తాయని ఆశిస్తున్నా” అని ఆడమ్స్‌ అన్నారు. ప్రతిపక్ష లేబర్‌ ఎంపీ వీరేంద్ర శర్మ మాట్లాడుతూ.. ”ఈ విషయంలో ఇరు వర్గాలు ఒక అడుగు వెనక్కి తగ్గి ఓ ఒప్పందానికి రావాల్సిన అవసరం ఉంది”అని అన్నారు.

అవన్నీ తప్పుడు వాదనలే..

అయితే ఈ డిబేట్‌ను భారత్‌ తీవ్రంగా ఖండించింది. ”సంయమన(బ్యాలెన్స్డ్‌) చర్చలకు బదులు.. తప్పుడు వాదనలు చేయడాన్ని, నిజానిజాలు తెలుసుకోకుండా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంపై నిందలు వేయడంపై మేం తీవ్రంగా చింతిస్తున్నాం” అని లండన్‌లో భారత హైకమిషన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. భారత్‌లో బ్రిటిష్‌ సహా అనేక వీదేశీ మీడియా సంస్థలు ఉన్నాయని, అవన్నీ రైతుల ఆందోళన గురించి ఎప్పటికప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయని పేర్కొంది. అందువల్ల భారత్‌లో మీడియాకు స్వేచ్ఛ కొరవడిందనే ప్రశ్నే రావొద్దని తెలిపింది. ఒకవేళ భారత్‌పై ఎవరైనా నిందారోపణలు చేయాలనుకుంటే అవన్నీ నేరుగానే చెప్పాలని ఘాటుగా సమాధానమిచ్చింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.