News

రఫెల్ రాకతో చైనా గుండెల్లో గుబులు

504views

చైనాతో ఘర్షణ వాతావరణం నెలకొన్న వేళ.. అత్యాధునిక రఫేల్‌ యుద్ధ విమానాలు భారత్ ‌కు చేరిన విషయం తెలిసిందే. అయితే, వీటి రాకతో చైనా ఆందోళనకు గురవుతోంది. రఫెల్ రాకతో చైనా ఆందోళన చెందడం నిజమేనని భారత వైమానిక దళాధిపతి కూడా స్పష్టంచేశారు. చైనా సరిహద్దుల్లో ప్రతిష్టంభన నెలకొన్న దృష్ట్యా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నామని ఐఏఎఫ్ చీఫ్‌ పేర్కొన్నారు.

‘ప్రస్తుతం సరిహద్దులో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ఇరు దేశాల సైనికాధికారులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. చర్చలు ఫలప్రదమౌతాయనే అశిస్తున్నాం. కానీ, ఒకవేళ కొత్త పరిస్థితులు ఎదురైతే మాత్రం వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇందుకు అవసరమైనన్ని బలగాలను రంగంలోకి దించాం’ అని భారత వైమానిక దళాధిపతి ఆర్‌కేఎస్‌ భదౌరియా ఓ వార్తా ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంచేశారు. సరిహద్దు ప్రాంతంలో చైనా, బలగాలను తగ్గించుకున్నప్పటికీ, ఇతర చర్యల ద్వారా రక్షణ సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ఇందులో భాగంగా J-20 యుద్ధవిమానాలను రంగంలోకి దించింది. వాటికి అనుగుణంగానే భారత్‌ కూడా వ్యూహాలు మారుస్తూ ముందుకెళుతూ ఉన్నదన్నారు. ఈ సందర్భంగా రఫేల్‌ రాక చైనాలో ఆందోళనకు కారణమయ్యిందా? అనే ప్రశ్నకు భారత వైమానిక దళాధిపతి ఖచ్చితంగా అవుననే సమాధానమిచ్చారు.

ఫ్రాన్స్‌ నుంచి దిగుమతి చేసుకున్న ఈ రఫేల్‌ యుద్ధవిమానాల సంఖ్య భారత్‌లో 11కి చేరింది. మొత్తం 36 రఫేల్‌ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌తో భారత్‌ ఒప్పందం కుదుర్చుకుంది. తొలి దఫాలో ఐదు, తర్వాత మూడు, మరో దఫాలో మూడు చేరుకోవడంతో ఇప్పటివరకు మొత్తం 11 రఫేల్‌ విమానాలను భారత్ ‌కు అందించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.