News

నూతన సాగు చట్టాల వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం – అమెరికా

625views

భారత ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పేరుతో కొందరు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా కొందరు విదేశీ సెలబ్రిటీలు (?) వివాదాస్పద ట్వీట్లు చేస్తున్న వేళ.. అగ్రరాజ్యం అమెరికా భారత ప్రభుత్వానికి ‌అండగా నిలిచింది. వ్యవసాయ రంగంలో సంస్కరణలకు భారత్‌ చేపట్టిన చర్యలకు బైడెన్‌ ప్రభుత్వం మద్దతిస్తుందని తెలిపింది. శాంతియుత ఆందోళనలు ప్రజాస్వామ్య దేశాల లక్షణమే అని, అయితే చర్చలతో ఆ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది.

భారత్ లో జరుగుతున్న రైతుల ఆందోళనపై అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ‘సాధారణంగా.. భారత మార్కెట్ల సామర్థ్యాన్ని పెంచేలా, ప్రైవేటు రంగ పెట్టుబడులను ఆకర్షించేలా ఆ దేశ ప్రభుత్వం చేపట్టే చర్యలను అమెరికా స్వాగతిస్తోంది. వ్యవసాయ రంగంలో భారత్ తీసుకొస్తున్న సంస్కరణల వల్ల అక్కడి రైతులకు మార్కెట్‌ పరిధి పెరుగుతుంది. అయితే, అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్య దేశాలకు శాంతియుత నిరసనలు అలవాటే. భారత సుప్రీంకోర్టు కూడా ఇదే విషయం చెప్పింది. కానీ ఎలాంటి విభేదాలనైనా చర్చలతోనే పరిష్కరించుకోవాలని అమెరికా ప్రోత్సహిస్తుంది’ అని తెలిపారు.

ఇదిలా ఉండగా.. అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలు హేలీ స్టీవెన్స్, మరో సభ్యురాలు ఇల్హాన్‌ ఓమర్, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ బంధువు మీనా హారిస్ తదితరులు రైతుల పేర జరుగుతున్న ఆందోళనకు మద్దతుగా కొన్ని వివాదాస్పద ట్వీట్లు చేశారు. ‌

వారి వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. వాస్తవాలను తెలుసుకోకుండా సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు చేయొద్దని అంతర్జాతీయ సెలబ్రిటీలను ప్రభుత్వం తీవ్రంగా హెచ్చరించింది. దేశంలోని చాలా తక్కువ మంది రైతులకు మాత్రమే సాగుచట్టాలపై అభ్యంతరాలున్నాయని భారత విదేశాంగశాఖ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.