
ఉగ్రవాదానికి అడ్డాగా మారిన పాకిస్థాన్ కు అంతర్జాతీయ సమాజంలో ఛీత్కారాలు తప్పడం లేదు. తాజాగా ఆ దేశానికి ఫ్రాన్స్ దిమ్మదిరిగే షాకిచ్చింది! వారి మిరేజ్ యుద్ధ విమానాలను ఉన్నతీకరించబోమని తెగేసి చెప్పింది. అంతేకాకుండా సరిహద్దుల్లో భారత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మరో కీలక నిర్ణయమూ తీసుకుంది. రఫేల్ యుద్ధ విమానాలను మరమ్మత్తు చేయించేటప్పుడు పాక్ మూలాలున్న సాంకేతిక నిపుణులను దగ్గరకు రానివ్వొద్దని కూడా ఖతార్ కు స్పష్టం చేసింది.
కొన్నాళ్ల క్రితం ఫ్రాన్స్ లో ఉగ్రదాడులు జరిగాయి. ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటామని ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ స్పష్టం చేశారు. ఆ సమయంలో భారత్ సహా అనేక దేశాలు ఆయనకు మద్దతుగా నిలిచాయి. కానీ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం భిన్నంగా స్పందించారు. ‘మనుషులందరినీ ఐకమత్యంగా ఉంచడమే నాయకుడి అసలైన బాధ్యత. అతివాదులకు తావులేకుండా అధ్యక్షుడు మెక్రాన్ చర్యలు తీసుకోవాల్సిన సమయం ఇదే. మత ప్రవక్త, ఇస్లాంను అర్థం చేసుకోకుండా కార్టూన్లు ప్రదర్శించే వారిని అడ్డుకోకుండా ఐరోపా, ప్రపంచంలోని ముస్లింల సెంటిమెంటును మెక్రాన్ గాయపరిచారు’ అని విమర్శించారు. అందుకే ఇప్పుడు పాక్ పై మెక్రాన్ ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.
పాకిస్థాన్ వాయుసేనలో ఎక్కువగా మిరేజ్ 3, మిరేజ్ 5 యుద్ధ విమానాలే ఉన్నాయి. ఫ్రెంచ్ కంపెనీ దసాల్ట్ ఏవియేషన్ వీటిని తయారుచేసింది. ప్రస్తుతం పాక్ వద్దనున్న మిరేజ్ విమానాల్లో కేవలం సగం విహంగాలకే మరమ్మతులు చేయగలరు. ఇప్పుడు ఫ్రాన్స్ వీటి ఉన్నతీకరణకు నిరాకరించడంతో పాక్ వాయుసేనపై తీవ్ర ప్రభావం పడనుంది. అంతేకాకుండా గగన రక్షణ వ్యవస్థ, ‘ఆగోస్టా 90బి’ తరగతి జలాంతర్గాముల్ని అప్ గ్రేడ్ చేసేందుకు కూడా నిరాకరించింది.
రఫేల్ యుద్ధ విమానాల మరమ్మత్తుల సమయంలో పాక్ మూలాలున్న సాంకేతిక నిపుణులను రానీయొద్దని ఖతార్ కు ఫ్రాన్స్ స్పష్టం చేయడం గమనార్హం. రఫేల్ విమానాల కొనుగోలు సమయంలోనే వీటి రహస్యాలను బయటవారికి తెలియనివ్వకూడదని భారత్ విజ్ఞప్తి చేయడమే ఇందుకు కారణం. సరిహద్దుల్లో మన దేశ ప్రయోజనాలకు భంగం కలగకూడదని ఫ్రాన్స్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.





