
రాష్ట్రంలో నవంబర్ 2 నుంచి పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం.. ఈ మేరకు షెడ్యూల్ ప్రకటించింది. ఏ తరగతులకు ఎప్పటి నుంచి బోధన ప్రారంభమవుతుందో తెలుపుతూ సీఎస్ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీచేశారు. దీని ప్రకారం పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించనున్నారు. రోజు విడిచి రోజు ఒంటిపూట మాత్రమే పాఠశాలలు తెరవనున్నారు. నవంబర్ 2 నుంచి 9, 10 తరగతులతో పాటు ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు బోధన ప్రారంభమవుతుంది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నవంబర్ 12 నుంచి తరగతులు మొదలవుతాయి. నవంబర్ 23 నుంచి 6, 7, 8 తరగతులకు.. డిసెంబర్ 14 నుంచి 1-5 తరగతుల విద్యార్థులకు బోధన ప్రారంభం కానుంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ఇదే షెడ్యూల్ వర్తిస్తుందని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొవిడ్ వ్యాపించకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోనున్నట్లు తెలిపారు.





