
తమిళ కావ్యాలలో తెలుగు మాటలకు స్థానం కల్పించిన మహాకవులలో కంబ కవి ప్రథముడు. ఆయన ‘‘తమ్మి, అక్కలు’’ మొదలైన తెలుగు మాటలను ప్రయోగించాడు. ఉత్తమ కవిత గోదావరి నదీ ప్రవాహంలా ఉండాలని ఆశించాడు. ఓరుగల్లును పరిపాలించిన మొదటి ప్రతాపరుద్రుని ఆస్థానాన్ని సందర్శించి ఆ కాకతి నృపునిపై ఒక పద్యం చెప్పినట్లు ప్రతీతి. ఇంత బంధం ఉన్నా, కంబ రామాయణం ప్రభావం ఇక్కడ పెద్దగా కానరాదు.
తెలుగు విద్వత్కవుల వలె కంబడు కూడా కొన్ని అవాల్మీకాంశాలను చేర్చాడు. వాటిలో ఒకటి సీతాపహరణ. వాల్మీకంలో రావణుడు తన చేతులతో సీతను అపహరించుకొని వెడలిపోగా, కంబ రామాయణంలోని రావణుడు పూర్వ శాప కారణంగా సీత సహా పర్ణశాలను పెకలించి తన రథంలో ఉంచుకుని ప్రయాణమయ్యాడు. సీతా మహాసాధ్విని రావణుడు తాకకుండా అపహరించాడని కంబడు తెలియజేస్తున్నాడు. ఆనాటి ప్రజల విశ్వాసాన్ని మన్నించి ఈ అంశాన్ని ఈ రీతిన గ్రంథస్థం చేసినట్లు భావించవచ్చు.
మలయాళంలో రామాయణాన్ని వెలయించిన కవిశేఖరుడు ‘తుంజత్తు ఎళుత్తచ్చన్’. ఆయనను ఆధునిక మలయాళ భాషా జనకునిగా కీర్తిస్తారు. తమిళ మలయాళాలలో కంబ, ఎళుత్తచ్చన్ అనే మహాకవులిద్దరూ గొప్ప రామాయణకర్తలు.
కంబ కవి రచన కంబ రామాయణంగా ప్రసిద్ది కెక్కినప్పటి, నిజమైన పేరు ‘రామావతారం’. ఎళుత్తచ్చన్ రచన, ఆధ్యాత్మ రామాయణం. రామకథై, కంబ నాటకం అనే నామాంతరం గల రామావతారం 42, 276 పాదాలు గల బృహద్రచన. కంబ రామాయణం ప్రక్షిప్తముల మయమని ప్రముఖ విమర్శకు టీకేసీ (టి.కె.చిదంబరనాద మొదలియార్) అభిప్రాయం. ఆధ్యాత్మ రామాయణంలో సుమారు 13,200 పద్యాలు ఉన్నాయి.
కంబన్ ఇంటి కట్టు కొయ్య కూడా కవిత చెప్పగలదట (కంబన్ లీట్టుత్తరియుం కవి చొల్లుం). ఎళుత్తచ్చన్ మాత్రం సామాన్యుడా? ఎళుత్తచ్చన్ అనే మాటకు అక్షరాచార్యుడని అర్థం. ‘‘తుంజన్ పరంబిలె మణ్ణం విద్యారంభత్తినె విశేషం’ అని జనశ్రుతి. ‘ఆ ఇంటి పెరటి ఇసుక• అక్షరాభ్యాసానికి శ్రేష్టమైనదని’, ఆ ఆవరణలోని చెట్టు ఆకుసైతం చేదుగా ఉండదనే నానుడి ఉంది. వీరిద్దరు సమకాలీనులు కారు. కంబన్ 9 లేదా 11వ శతాబ్దం వాడు, ఎళుత్తచ్చన్ 16వ శతాబ్ది ఉత్తరార్ధంలో జీవించాడు.
వీరికి ముందు, వెనుక ఆ భాషలలో రామకథా రచనలు వెలువడక పోలేదు. తమిళ సాహిత్యానికి శ్రీకారం చుట్టిన సంగమ యుగంలోనే రామకథా ప్రశంస ఉంది. నాటి కృతులలో ఒకటైన ‘అగ నానూరు’లో అద్భుత సన్నివేశం ఉంది. దశకంఠునిపై దండయాత్రకు సంబంధించి ధనుష్కోటిలో ఒక రావిచెట్టు నీడను రామచంద్రుడు సహచరులతో సమాలోచన జరుపుతున్నాడు. అప్పుడు చెట్టు మీద పక్షులు చెవులు చిల్లులు పడేటట్లు గోల చేస్తున్నాయి. వాటి వంక రాముడు చూశాడు. పక్షులనోళ్లకు తాళాలు పడ్డాయి. అంటే పిట్టలూ పులుగులూ సైతం రాముడి పక్షం వహించాయన్న మాట. పరిపాడల్ అనే మరోకృతిలో అహల్య కథను తెలియజేసే ఒక పద్యం కానవస్తున్నది. తమిళనాడులో ప్రసిద్ధమైన కధకు అనుగుణంగా ఇంద్రుడు పిల్లి రూపంతో గౌతమాశ్రమమం నుంచి నిష్క్రమించినట్లు తెలియ జేస్తున్నది. క్రీ।।శ।। 650 ప్రాంతంలో రామాయణాన్ని సీరామకథై (శ్రీరామ కధ) అని వ్యవహరించేవారని తమిళ పండితుల మాట.
సిలప్పదికారంలో అయోధ్య ప్రస్తావన ఉంది. 12వ శతాబ్దంలో పెరియ వాచ్చాన్ పిళ్ళై అనే వైష్ణవాచార్యుడు ‘పాశురప్పడి రామాయణం’ పేరుతో ఓ లఘకృతిని రాశాడు. 18వ శతాబ్దంలో అరుణా చల కవి ‘రామాయణ కీర్తనై’ రాశాడు. ఇది కీర్తనల రూపంలోని రామకథ. వీటిని నేటికి పాడుతున్నారు. ఆధునికులలో కొట్టైయూర్ సుబ్రమణ్య అయ్యర్, ఆళవందార్, వేంకట కృష్ణ అయ్యంగార్‌లు రామాయ ణాలు రాశారు. కంబ రామాయణం వెలుగులోనికి వచ్చాక తక్కినవన్నీ మరుగున పడిపోయాయి.
ఆధ్యాత్మ రామాయణానికి ముందు మలయాళంలోనూ రామకథా సాహిత్యం వెలసింది. మలయాళంలో వెలసిన తొలి రామకథా కావ్యం ‘రామచరితం’. ఇది సీరామ కవి కృతి. శ్రీరామ పట్టాభిషేకంతో ముగిసిన మలయాళ రామచరిత కావ్యం వాల్మీకానికి సన్నిహితంగా కన్పిస్తుంది. 15వ శతాబ్దికి చెందిన కణశ్శ ఫణిక్కర్ రచించిన రామాయణం మలయాళంలో రెండవ రామకృతి. కణ్ణిశ్శ రామాయణం ఎళుత్తచ్చన్ వంటి మహాకవుల్ని కూడా ప్రభావితం చేసింది. 15వ శతాబ్దంలోనే మరి రెండు రామాయణాలు వెలువడ్డాయి. ఒకటి అయ్యపిల్ల ఆశాన్ రామకథా పాట్టు, ఇంకా పుణం నంబూద్రి అనే ఆయన చంపూలో రామాయణం రాశారు. ఎళుత్తచ్ఛన్ శైలి, మలయాళీలను బహుధా ఆకర్షించింది. ఇతర భాషా రామాయణాలకు వాల్మీకం మాతృక. కాని ఎళుత్తచ్చన్ వాల్మీకిని అనుసరిస్తూనే స్థానిక విధానాలకు ప్రాధాన్యమిచ్చాడు. అందుకే అది పండిత పామరు రంజక రచన అయ్యింది. ఎళుత్తచ్చన్ రామాయణం పారాయణ గ్రంథం. ఈ గ్రంథంలోని కొన్ని భాగాలు చదివితే కన్యలకు మంచి భర్త లభిస్తాడని కేరళీయుల విశ్వాసం. సాయంకాలం దీపం పెట్టగనే ఎళుత్తచ్చన్ రామాయణంలోంచి కొన్ని పద్యాలు చదవడం మొన్న మొన్నటి వరకు కేరళలో కన్పించిన ఆచారం. ఈ సందర్భంతో అచ్యుతమీనన్ అన్న మాటలు. “The practice which enjoins on the people the reading of Ezuthachan’s Ramayana every day as a matter of obligatory religious duty still lingers in the nooks and corners of Malabar, inspite of the temptaions of critical thought”.
ఎళుత్తచ్చన్ కృతికి ఇంతటి ఆదరణకు కారణం- కమ్మని కవిత, నిక్షిప్తమైన వేదాంత సుధ, భక్తిభావం. ఎళుత్తచ్చన్ మాటలలో ‘‘రామా! నీ పాద సేవకుడను, భక్తదాసుడను, బ్రహ్మపాదజుడను అజ్ఞానులలో ఆద్యుడను అయిన నేను వేద సమ్మతంగా వెలసిన రామాయణమును జ్ఞానహీనులకు తెలియజేసేలా వివరిస్తాను’’ అని సహజ వినయంతో పేర్కొన్నాడు, కృతకృత్యుడయ్యాడు.
ఎళుత్తచ్చన్, కంబకవి బ్రాహ్మణేతరులు, వినయశీలురు. వాల్మీకి రామాయణం వ్యాప్తిలో ఉండగా, తన వంటివారు మళ్లీ రాయడం పాల సముద్రాన్ని తాగి వేయాలని తలచిన పిల్లి ఆశ వంటిదని కంబన్ ముందు మాటలోనే చెప్పాడు.
ఎళుత్తచ్చన్ ‘‘ఆధ్యాత్మ రామాయణం’’ ఆవిర్భవించిన తీరు ఇది. ‘అంబలపూళని (కొచ్చిన్‌కు 80 కి.మి.) దేవ నారాయణుడనే, నంబూద్రి బ్రాహ్మణ ప్రభువు పరిపాలించేవాడు. ఆయన కొలువుకు ఒకనాడు ఉత్తరదేశం నుండి ఒక బ్రాహ్మణుడు సంస్కృత తాళపత్ర గ్రంథంతో వచ్చాడు. లిపి మాత్రం తెలుగు. దానిని రాజుకు బహుకరించాడు. అప్పుడు ఆ కొలువు కూటంలోనే ఉన్న మహా పండితుడు నారాయణీయం కర్త నారాయణ భట్టతిరి ఒక్క ఎళుత్తచ్చన్‌కి తప్ప మరెవ్వరికీ తెలుగు లిపి తెలియదని కాబట్టి ఆయనచేత ఆధ్యాత్మ రామాయణాన్ని మలయా ళంలో రాయించడం మంచిదని సూచించాడు. ఆ సూచన రాజుకు నచ్చింది. రాజాజ్ఞ ప్రకారం ఆధ్యాత్మ రామాయణాన్ని లిప్యంతరం చేయడమేగాక అనువదించాడు కూడా ఎళుత్తచ్చన్ మహాకవి.
కంబకవి ఎన్నో అవాల్మీకాలను చేర్చాడు. ఆయన స్త్రీ పాత్ర చిత్రణ ఉదాత్తమైనది. ముఖ్యంగా రామదర్శ నానంతరం సీత చెందిన విరహం కంబ రామాయ నంలో 40 పద్యాలలో వివరించాడు. కానీ వాల్మీకం ఒకటి రెండు శ్లోకాలలో ముగించింది. దశరథుడు మిథిల ప్రయాణం మున్నూరు పద్యాలు రాశాడు. అందుకే చిత్తూరు జిల్లాలో ఎవరైన దీర్ఘ వర్ణన చేస్తే ‘‘ఏమిరా కంబ రామాయణం చెబుతున్నావ్’’ అనే మాట వచ్చింది.
స్వయం వరానికి పూర్వమే సీతారాములు ఒకరినొకరు ప్రేమించుకొనుట, పిల్లి రూపంలో ఇంద్రుడు గౌతమాశ్రమం నుంచి నిష్క్రమించుట, దశరధుని కోరికననుసరించి శతృఘ్నుడు ఆయనకు అంత్యక్రియలు జరుపుట, అగస్త్య మహర్షిని తమిళ విద్యాంసునిగా చిత్రించుట. పర్ణశాలా సహితంగా సీతను రావణాసురుడు అపహరించుట, కైకేయిని రాముడు దూషణోక్తులాడకుండుట, భాతృప్రేమ గల సోదరునిగా కుంభకర్ణుని వర్ణించుట, యుద్దరంగంలో మృతుడై పడియున్న భర్తను చూసి మండోదరి అక్కడికక్కడే మరణించుట, విభీషణుడు రావణాసురు నికి, మండోదరికి అంత్యక్రియలు నిర్వహించుట, మాయా జనక పాత్రను సృష్టించుట, కంబకవి పోషకుడైన శడయప్పముదలి పూర్వులు ఇచ్చిన కిరీటమును వశిష్ఠుడు రాముని శిరస్సుపై ఉంచుట మొదలైనవి కంబ రామాయణంలో కానవచ్చే మార్పులు. ఈ మార్పులు ఎళుత్తచ్చన్ రామాయణంలో కన్పించవు. కంబరామాయణంలోని రమణీయ సన్నివేశాలలో ఒకటి సీతారాముల ప్రణయోదంతం, అలాగే 5000 మంది బలాఢ్యులు తీసుకువచ్చిన శివధనస్సును రాముడు విరిశాడు.
సీతారాముల వివాహాన్ని వర్ణిస్తూ సీత రెండు దండలు వేసిందని ఎళుత్తచ్చన్ పేర్కొన్నాడు. ఒకటేమో చూపులదండ (నేత్రోత్పల మాల) మరొకటేమో పెండ్లి దండ (వరణార్ధమాల). కంబ మహాకవి శూర్పణఖను అందాల బరిగా, లావణ్య లతికగా చూపాడు పేరు కామవల్లి. ఆమె తీగ వలె సన్నగా రెపరెపలాడుతూ ఉన్నది. నడకేమో హంస నడక, సోయగం నెమలివంటివి, పలుకు తియ్యన, కాని మనస్సు మాత్రం విషపూరితం. ఎంత అందాల కొలికి వచ్చినా రాముడు తన ఏకపత్నీ వ్రతానికి భంగం కలగదని చెప్పడానికి కంబకవి శూర్పణకకు మనోహర రూపాన్ని కల్పించి ఉండవచ్చును.
కంబని కాలానికి సీతారాములు, లక్ష్మీనారా యణుల అవతారమనే విశ్వాసం ఉండేది. పైగా కావ్యనామం ‘రామావతారం’. కాబట్టి మలిన మనస్కుడై వచ్చిన రావణుడు సాక్షాత్తూ లక్ష్మీదేవి అవతారమైన సీతాదేవిని తాకరాదు. కాబట్టి ఆమెను పర్ణశాల సహా ఎత్తుకుపోయాడు. వాలి మరణా నంతరం ఆయన భార్య తార సుగ్రీవుని వలపు నేస్తంకాక విరక్త మనస్కగా ఉండిపోయింది. కారణం పంచకన్యలలో తార కూడా ఒకరు, ఇతరులు అహల్య, ద్రౌపది సీత, మండోదరి.
వానాకాలం వచ్చేస్తున్నది, అనుకున్న ప్రకారం సుగ్రీవుడు యుద్ద సన్నాహాలకు దిగలేదు. అది రాముడి కోపానికి కారణమయ్యింది. లక్ష్మణుడు కిష్కింధకు ప్రయాణమైనాడు. ఉగ్రరూపంతో వస్తున్నాడు. లక్ష్మణమూర్తిని చూసి వానరవీరులు భయపడి పోతున్నారు. సుగ్రీవుడు మద్యపానమత్తుడై మన లోకంలో లేడు. తార రామానుజుని సమీపించింది. వారిని చూసేసరికి అగ్నిపర్వతం వంటి లక్ష్మణుడు శాంతమూర్తి అయి తలవంచుకున్నాడు. అప్పుడు తార ‘‘మీ రాకతో మా భవనం పునీతమయింది. రాముణ్ణి ఒంటరిగా విడిచి మీరు ఇక్కడకు రావడం విడ్డూరంగా ఉంది. మీ కోపాన్ని చూచి మా వానరులందరూ భయభ్రాంతులైనారు. ఇంతకూ మీ రాకకు కారణం?’’ అని అడిగింది. తీయని కంఠంతో తారపలికిన ఆ మృదూక్తులు లక్ష్మణుని ఆశ్చర్యంలో ముంచేశాయి. ఎవరాని లక్ష్మణుడు తల ఎతి చూశాడు. శ్వేత వస్త్రధారణలో తార ఆమెను చూడగానే లక్ష్మణమూర్తికి తన తల్లులు గుర్తుకు వచ్చారు. ఈ సన్నివేశం కంబ విమర్శకులకు సైతం ఆ కల్పనా చాతురికే కైమోడ్పులు ఘటించక తప్పలేదు.
ఎళుత్తచ్చన్ కూడా సీతారాములను దైవ స్వరూపులుగా భావించాడు. సుందరకాండలోని ఒక సన్నివేశం ఎళుత్తచ్చన్ ప్రతిభకు దర్పణం పడుతుంది. అశోకవనంలో ఉన్న సీతను సమీపించి రావణుడు ఇరవై పాదాలలో రాముణ్ణి గురించి నిందాస్తుతి చేస్తాడు. దానిలో నాలుగు పాదాలు పరిశీలిద్దాం, రాముడు నీ భర్త అయినా, దశరథ తనూజుడే అయినా, అతనిని కొందరు మాత్రమే కొన్నివేళల్లో చూడగలుగుతారు. అంటే రాముడు సన్యాసి వలె ఊరూరూ తిరుగుతున్నాడు. కనుక అతనిని కొన్నివేళల్లోనే చూడగలుగుతున్నారని భావం. అతడు పరమాత్ముడు గనుక, చివరికి అతని భార్యగాని, జనకుడుగాని అతనిని దర్శించలేరని అంతరార్ధం. చివరికి కామ వివశుడైన రావణుని చేత ఇలా పలికిస్తాడు, ఎళుత్తచ్చన్ ‘‘సుముఖి!’’ తవ చరణ నలిన దాసోస్మ్యహం’’ అని నేను నీ యందు బద్దానురాగుడనై ఉన్నాను’’ ఇక నీవే నాకు దిక్కు – అన్నది మామూలు అర్ధం. కానీ ఇక నీ చరణములే నాకు శరణ్యం, నేను నీ చరణదాసుణ్ణి. ఇక్కడ శరణాగతి అన్నదే అసలు భావమని విజ్ఞుల అభిప్రాయం.
కంబన్, ఎళుత్తచ్చన్ మహాకవుల మాతృ భాషాభిమానం బహుదా ప్రశంసార్హం. దేశీయ చందస్సులలో గ్రంధాన్ని వ్రాశారు. ఎళుత్తచ్చన్ కేరళీయులకు చక్కని మలయాళ శైలిని ప్రసాదించి చిరస్మరణీయుడయ్యాడు. కంబన్ మాతృ భాషాభి మానం పలుచోట్ల ప్రదర్శితమవుతుంది.
కంబ రామాయణంలో ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నది ‘సర్వమానవ సౌభాత్రం’. అటవికుడైన గుహుడు ప్రదర్శించిన భక్తికి మెచ్చుకొని, ‘అయోధ్యలో మేము నలుగురు అన్నదమ్ములం, కాని ఇప్పుడు అయిదు మందిమయినాము, సుగ్రీవుని చూసి ఇప్పుడు మేము ఆరుగురము’ అని రాముడు అన్నాడు. రాక్షసుడైన విభీషణునితో చెలిమి ఏర్పడిన తర్వాత, ‘ఇప్పుడు మేము ఏడుగురం అన్నదమ్ములం’ అని ప్రకటించాడు రాముడు. ఈ విధంగా కంబ రామాయణంలో వివిధ వర్గాల నడుమ సోదరభావం స్థాపించడం కనిపిస్తుంది.
మూలం:
తులనాత్మక సాహిత్యం బై చల్లా రాధా కృష్ణ శర్మ పేజీ.16 టు 17, 22, 142 టు 156.
-డా. కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యుడు





