
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్య శతాబ్ది సందర్భంగా దేశ వ్యాప్తంగా వివిధ రకాల కార్యక్రమాలతో పాటు పథ సంచలన్ (రూట్ మార్చ్) జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నింటికీ ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. దీనిని చూసి ఓర్చుకోలేక పోతున్నారు సైద్ధాంతిక విరోధులు. ఏదో ఒక రకంగా సంఘ్ ని నిందించాలని, ఇరుకున పెట్టాలని చూస్తున్నారు. స్వీయ రక్షణ కోసం ధరించే దండ (లాఠీ)ని కూడా తప్పుడు వ్యాఖ్యానాలిస్తూ లేని పోని అపోహలు లేపుతున్నారు.
తాజాగా కర్నాటకలోని కలబురగి ప్రాంతంలో ఇదే జరిగింది. అక్కడి చిట్టాపూర్ అనే గ్రామంలో సంఘ కార్య శతాబ్ది సందర్భంగా ‘‘పథ సంచలన్’’ నిర్వహించాలని సంఘ్ నిర్ణయించింది. దీనికి లేనిపోని అపోహలు సృష్టించి, శాంతిభద్రతల సమస్యలంటూ సైద్ధాంతిక విరోధులు నానా రభస చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. పథ సంచలన్ నేపథ్యంలో ఈ నెల 28 న శాంతి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కలబురిగి కలెక్టరేట్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కొన్ని సంస్థలు హాజరయ్యాయి. అలాగే ఆరెస్సెస్ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పథ సంచలన్ నేపథ్యం, ఎందుకు చేయాలనుకుంటున్నారో సమావేశం ముందు వుంచారు. అయితే.. సంఘ్ విరోధులు ఎప్పటిలాగే మాటల యుద్ధానికి తెరలేపారు. సమావేశానికి తీవ్ర అంతరాయం కలిగించారు. దీంతో చిన్నపాటి ఘర్షణకు కూడా దారితీసింది. దీంతో శాంతి సమావేశం కాస్తా పక్కదారి పట్టింది.
ఆరెస్సెస్ లో భాగమైన ‘‘దండ’’ (లాఠీ) పై అభ్యంతరాలు లేవదీశారు. లేనిపోని అపోహలు సృష్టించారు. పథ సంచలన్ సమయంలో స్వయంసేవకులు దండ లేకుండా చూడాలంటూ డిమాండ్ చేశారు. దీంతో వివాదం రేగింది. దండ ద్వారా ప్రజల్లో భయాందోళనలు రేకెత్తుతాయని, అశాంతికి దారి తీస్తుందంటూ వాదించారు. అయితే.. దీనిపై ఆరెస్సెస్ ప్రతినిధులు కూడా అంతే తీవ్రంగా స్పందించారు. ఆరెస్సెస్ లో దండ భాగమని, అది లేకుండా పథ సంచలన్ కుదిరే పని కాదని, దానిని వదులోకమని తేల్చి చెప్పేశారు. దీంతో వాగ్వాదం జరిగింది. చివరికి భీమ్ ఆర్మీ, దళిత్ పాంథర్ కార్యకర్తలు జిల్లా యంత్రాంగం ఆరెస్సెస్ కి అనుకూలంగా వుందని నినాదాలు చేశారు. దీంతో ఈ సమావేశం అర్ధాంతరంగా నిలిచిపోయింది.
అయితే.. ప్రతి సంస్థ నుంచి ముగ్గురు ప్రతినిధులు మాత్రమే హాజరు కావాలని జిల్లా యంత్రాంగం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అయినా సరే గుండప్ప లండన్కర్ అనే వ్యక్తి నిబంధనను తుంగలో తొక్కుతూ సమావేశం మందిరంలోకి వచ్చేశారు. అధికారిక జాబితాలో ఆయన పేరు కూడా లేదు. దీనిపై కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
సంఘ కార్య శతాబ్ది సమయంలో లేదా అంతకు ముందు జరిగిన పథ సంచలన్ లో ఎక్కడా హింస చెలరేగలేదు. సంఘ స్వయంసేవకులు పథ సంచలన్ లో ఎక్కడా క్రమశిక్షణా రాహిత్యంతో ప్రవర్తించలేదు. ఎక్కడా ట్రాఫిక్ కి అంతరాయం కలిగించలేదు. దండ (లాఠి)తోనే పథ సంచలన్ జరిగాయి. ఎక్కడా దండను స్వయంసేవకులు దురుపయోగం చేయలేదు.
తాజాగా… ఈ నెల 28 న ఇదే కర్నాటక రాష్ట్రంలోని నలత్ వాడలో బ్రహ్మాండమైన పథ సంచలన్ జరిగింది. వందల మంది స్వయంసేవకులు దండధారులై పథ సంచలన్ లో పాల్గొన్నారు. స్థానిక ప్రజలు పూలు చల్లుతూ స్వయంసేవకులకు స్వాగతం పలికారు.
2. అక్టోబర్ రెండో తేదీన దేశ రాజధాని ఢిల్లీలో 346 ప్రాంతాలలో పథ సంచలన్ జరిగింది. వందల మంది స్వయంసేవకులు దండధారులై ఈ సంచలన్ లో పాల్గొన్నారు. ఎక్కడ కూడా స్వయంసేవకులు తమ దండను దుర్వినియోగం చేయలేదు. ఎవ్వర్నీ భయపెట్టించలేదు.
3. అక్టోబర్ 6 వ తేదీన ఇందోర్, చుట్టుపక్కల ప్రాంతాల్లో స్వయంసేవకులు పథ సంచలన్ ని నిర్వహించారు. స్వయంసేవకులు గణవేషతో, దండతో పథ సంచలన్ జరిగింది. 1.5 లక్షల మంది స్వయంసేవకులు ఈ పథ సంచలన్ లో పాల్గొన్నారు.
4. తమిళనాడులో 58 చోట్ల స్వయంసేవకులు పథ సంచలన్ ని నిర్వహించారు. వందల మంది స్వయంసేవకులు దండధారులై ఈ సంచలన్ లో పాల్గొన్నారు. ఎక్కడ కూడా చిన్న అశాంతి సంఘటన కూడా చోటు చేసుకోలేదు. మొత్తం శాంతియుతంగానే జరిగింది.





