News

కుల్‌భూషణ్‌ కేసులో భారత డిమాండ్‌కు పాక్‌ నో

488views

గూఢచర్యం ఆరోపణలు ఎదుర్కొంటూ పాక్‌ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసులో పోరాడటానికి తమ న్యాయవాదులను అనుమతించాలన్న భారత్‌ డిమాండ్‌ను పాకిస్థాన్‌ కోర్టు కొట్టివేసింది. ఈ విషయాన్ని అక్కడి మీడియా గురువారం వెల్లడించింది.

‘జాదవ్‌ కేసులో భారత్‌ నుంచి ఏవిధమైన డిమాండ్లను పాక్‌ ఎప్పటికీ అంగీకరించదు’ అని పాక్‌ విదేశాంగ శాఖ కార్యాలయ ప్రతినిధి జహీద్‌ హఫీజ్‌ చౌదరి తెలిపారు. పాకిస్థాన్‌ కోర్టుకు సహకరించడం తప్ప భారత్‌కు వేరే మార్గం లేదని, స్థానిక న్యాయవాదులను మాత్రమే బెంచ్‌ ముందుకు అనుమతించనున్నట్లు జహీద్‌ పేర్కొన్నారు. భారత్ డిమాండ్లకు అనుగుణంగా పాకిస్థాన్‌ చట్టాలలో ఏవైనా సడలింపులు పరిశీలిస్తున్నారా అనే ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే జాదవ్ తరఫు న్యాయవాదిని నియమించడానికి భారత్‌కు మరో అవకాశం ఇవ్వాలని ఇస్లామాబాద్ హైకోర్టు (ఐహెచ్‌సి) ఇటీవలే పాక్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు విచారణను అక్టోబర్ 3 వరకు వాయిదా వేసింది. జాదవ్‌పై తన ఉత్తర్వులను భారత్‌కు పంపాలని పాకిస్థాన్ ఫెడరల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.