News

చైనా దానవత్వం – భారత్ మానవత్వం

614views

చైనా దుర్మార్గం :

డవిలో వేటకు వెళ్లిన అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన ఐదుగురు పౌరులను చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ (పీఎల్‌ఏ) ఆర్మీ సైనికులు అపహరించారు. భారత్‌- చైనా మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఘటన జరగడం గమనార్హం. అప్పర్‌ సుబన్‌సిరి జిల్లాలో నాచో ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన జరిగినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

జిల్లా కేంద్రం నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాచో ప్రాంతంలో కొందరు వేటకు అడవిలోకి వెళ్లారు. అలా వెళ్లిన వారిలో ఐదుగురిని చైనా బలగాలు అపహరించాయి. అదే బృందంలో ఉన్న ఇద్దరు తప్పించుకుని వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై కుటుంబ సభ్యులు ఆర్మీ అధికారులను కలిశారు. ఆర్మీ దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

స్థానిక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నినాంగ్‌ ఎరింగ్‌ కూడా దీనిపై పీఎంవోకు ఫిర్యాదు చేశారు. చైనా బలగాలు ఐదుగురు పౌరులను అపహరించాయని, గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయని పేర్కొన్నారు. చైనా బలగాలకు సరైన రీతిలో బుద్ధి చెప్పాలని ఆయన ప్రధాన మంత్రి కార్యాలయాన్ని కోరుతూ ట్వీట్‌ చేశారు. వాస్తవాధీన రేఖను దాటి చైనా బలగాలు దేశంలోకి చొరబడ్డాయని ఓ టీవీ ఛానల్‌తో పేర్కొన్నారు. ఈ ఘటనపై అరుణాచల్‌ ప్రదేశ్‌ పోలీసులు విచారణ జరుపుతున్నారు. నాచో పోలీస్‌స్టేషన్‌కు విచారణ అధికారిని పంపించామని, త్వరలో వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ తెలిపారు.

మానవత్వం ప్రదర్శించిన భారత సైనికులు :

కయ్యాలమారి చైనా కాటేసేందుకు కాచుకుని కూర్చొన్నా, దీటైన జవాబిచ్చే సత్తా ఉన్న భారత్‌ మాత్రం ఎంతో సంయమనాన్ని పాటిస్తూ వస్తోంది. గల్వాన్‌ ఘటనలో మన సైనికులను పొట్టన పెట్టుకున్నా పొరపాటున భారత భూభాగంలోకి వచ్చిన వారి పౌరుల ప్రాణాలు నిలబెట్టింది. దారితప్పి మన భూబాగంలోకి వచ్చిన చైనీయులను భారత సైన్యం ఆదుకుంది.

కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు చైనీయులు దారి తప్పి భారతదేశంలోని ఉత్తర సిక్కిం ప్రాంతానికి చేరుకున్నారు. సముద్రమట్టానికి 17,500 అడుగుల ఎత్తు, సున్నా డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతతో అక్కడి వాతావరణ స్థితి అత్యంత కఠినంగా ఉంటుంది. ఈ పరిస్థితిలో అల్లాడుతున్న చైనీయులకు భారత సైన్యం సాయం చేసింది. వారికి ఆక్సిజన్‌, ఆహారం, వెచ్చని దుస్తులు అందించటమే కాకుండా వారు తిరిగి వెళ్లేందుకు దారి చూపింది.

సెప్టెంబర్‌ 3న చోటుచేసుకున్న ఈ సంఘటనకు గురించిన వివరాలను భారత సైన్యం నేడు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది. రాజకీయ, సైనికపరంగా వైషమ్యాల సంగతి ఎలాఉన్నా శత్రుదేశ ప్రజలను కూడా కాపాడే మానవత్వం తమదంటూ భారత సైన్యం ఈ చర్యతో చాటిచెప్పింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.