
భారత్ సహా ఆసియా దేశాలకు చైనా సైన్యం నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు తమ అంతర్జాతీయ బలగాలను తరలించే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో చెప్పారు. డ్రాగన్ సైన్యాన్ని ఎదుర్కొనేందుకు తాము సన్నద్ధంగా ఉన్నామన్న ఆయన అందుకు అవసరమైన వనరులను సిద్ధం చేస్తామని బ్రెస్సల్స్ ఫోరం 2020నుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యాఖ్యానించారు.
జర్మనీలో అమెరికా బలగాలను 52వేల నుంచి 25వేలకు తగ్గిస్తున్న క్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా సైనిక బలగాల సమీక్ష చేపడతామని పాంపియో తెలియజేశారు. నిర్దిష్ట ప్రాంతంలో అమెరికా దళాలు ఉన్నాయన్న పాంపియో.. భారత్, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా వంటి దేశాలకు చైనా నుంచి ముప్పు నెలకొందని అభిప్రాయపడ్డారు. ఏ ప్రాంతానికైనా ముప్పు ఎదురైతే ఇతర దేశాలు బాధ్యత తీసుకుని వారిని రక్షించాల్సిన అవసరముందని మైక్ పాంపియో పేర్కొన్నారు. భారత్- చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.





