ArticlesNews

గిరిజనుల జీవితాలలో వెలుగులు నింపిన ‘వెన్నెల’కంటి

3.5kviews

ప్రజలందరూ నెల్లూరు గాంధీ అని ప్రేమ గా  పిలుచుకునే స్వర్గీయ వెన్నెలకంటి రాఘవయ్య 1897 జూన్ 4 తారీఖున నెల్లూరుజిల్లా కోవూరు తాలూకా శింగపేటలో శ్రీ వెన్నెలకంటి పాపయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. నెల్లూరు వి.ఆర్ పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తయ్యాక మద్రాస్ పచ్చియప్ప కళాశాలలో బి.ఏ మరియు న్యాయవాద విద్యను పూర్తి చేశారు.

స్వతంత్ర సంగ్రామం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో గాంధీజీ పోరాటానికి ఆకర్షితుడైన శ్రీ రాఘవయ్య నెల్లూరు జిల్లా కాంగ్రెస్ కి తొలి కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఉక్కు కణిక శ్రీమతి పోనకా కనకమ్మ, శ్రీమతి బాల సరస్వతమ్మ, శ్రీ వేమూరి లక్ష్మయ్య, శ్రీ చతుర్వేదుల వెంకట కృష్ణయ్యలను సంఘటితం చేసి స్వరాజ్య సంఘం స్థాపించి  స్వాతంత్ర పోరాటాన్ని మరింత ఉధృతంగా కొనసాగించారు.

సహాయ నిరాకరణ, ఉప్పుసత్యాగ్రహోద్యమాలలో చురుగ్గా పాల్గొన్న శ్రీ రాఘవయ్యను బ్రిటిష్ వారు అరెస్ట్ చేసి 22 నెలలు జైలులో ఉంచారు. జైలు నుంచి బయటకి వచ్చిన శ్రీ రాఘవయ్య క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని దేశానికి స్వాతంత్రం తేవడంలో తన వంతు పాత్ర పోషించారు.

వెంకటగిరి రాజాలకు, రైతులకు జరిగిన పోరాటంలో రైతుల పక్షాన పోరాడి విజయం సాధించారు. పెన్నా,కృష్ణ నీటి పారుదల ప్రాజెక్టుల కోసం అనేక పోరాటాలు చేశారు. ఇవాళ కృష్ణ,పెన్నా నీటి పారుదల ప్రాజెక్టులు ఆ మహనీయుని పుణ్యమే. ఉమ్మడి మద్రాసు రాష్ట్ర అసెంబ్లీకి రెండుసార్లు నెల్లూరు నుంచి ప్రాతినిధ్యం వహించారు. వారు పార్లమెంటరి పార్టీ కార్యదర్శిగా కూడా పని చెయ్యడం విశేషం.

గిరిజనులకు ఆరాధ్యదైవం

1946లో భారతదేశంలో గిరిజనుల పట్ల శాపంగా మారిన అతి భయంకర, క్రూరమైన 1871ట్రైబల్ ఆక్ట్ ని రద్దు చేయించడంలో శ్రీ రాఘవయ్య గారిది ప్రధాన పాత్ర. శ్రీ ప్రకాశం పంతులు సారథ్యంలో ట్రైబల్ యాక్ట్ రద్దు కోసం శ్రీ రాఘవయ్య తీవ్రంగా కృషి చేశారు.

ట్రైబల్ ఆక్ట్ గురించి ఇప్పడు ప్రతి గిరిజనుడు తెలుసుకోవాలి. ఇది ఎంత భయంకర చట్టం అంటే బ్రిటిష్ వారి అవసరాల కోసం అంటే రోడ్లు వేసేదానికి, బ్రిడ్జ్ లు కట్టే దానికి, రైల్వే ట్రాక్ లు నిర్మించే దానికి వాళ్ళకి బానిసలుగా పని చేసేదానికి గిరిజనులను,దొంగలు,దోపిడీ దారులుగా చిత్రికరించి వారి మీద నాన్ బెయలబుల్ సెక్షన్ లు పెట్టి గిరిజనులను ప్రభుత్వ బానిసలుగా చేసుకునేదే ఈ చట్టం. తప్పు చేసినా చెయ్యకపోయినా తండాలు, సంఘాల్లో ఉండే గిరిజనులు వారం వారం వెళ్లి పోలీస్ స్టేషన్ లో వేలి ముద్రలు వేసి రావాలి.

ఈ చట్టం వలన దేశంలోని అనేక గిరిజన తెగలు బాధలు వర్ణనాతీతం గా ఉండేవి. ఈ చట్టం వలన  గిరిజనులను ఊర్లలోకి రానిచ్చే వారు కాదు.

శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య పోరాట ఫలితంగా 1947లో ఈ చట్టాన్ని తొలగించారు. శ్రీ రాఘవయ్య #ఆది_ఆంద్రా  సంఘాన్ని స్థాపించి యానాదులు, ఎరుకలు, లంబాడీలు, చెంచులు, కోయలు, బుడబుక్కల వంటి సంచార జాతులను సమీకరించి, సంఘటితం చేసి వారిలో అనేక మార్పులకు కారణం అయ్యారు.

ముఖ్యంగా చెట్టుకొకరు, పుట్టకొకరు విసిరేసినట్లుండే యానాదులు, చల్లాయానాదులను సంఘటితం చేసి కాల్వల పక్కన, చెరువుల పక్కన, పొలాల్లో గుడిసెలు వేసుకుని మిగిలిన సమాజంతో సంబంధం లేకుండా వెలివేసినట్లు బ్రతుకుతున్న యానాధులను ఒక్కటిగా చేసి వారికి కాలనీలు నిర్మించి, వారి పిల్లలు చదువుకునేందుకు పాఠశాలలు, బాల బాలికలకు వేర్వేరు హస్టళ్ళు నిర్మించి విద్యను అందించడంలో ఆయన చేసిన కృషి మరువలేనిది.

నేడు నెల్లూరు జిల్లాలో యానాధులకు చదువు అనేది తెలిసింది అంటే ఆ మహనీయుని పుణ్య ఫలితమే. ఇవాళ జిల్లాలో ఉన్న అనేక గిరిజన సంఘాలు, కాలనీలు ఆ మహాను భావుడు ఏర్పాటు చేసినవే కావడం గమనార్హం.

ఆదిమ జాతి సేవక్ సంఘ్ సభ్యులైన థక్కర్ బాబా తో కలిసి హస్టళ్ళు నడపడం తోబాటు, మైదాన ప్రాంత ప్రజలు గిరిజనులకు చేస్తున్న మోసాలను అరికట్టడంలోనూ చైతన్య పరచడం లోనూ, పని మనుషుల కోసం గిరిజనుల పిల్లల్ని అమ్మే  ఆచారాన్ని రూపు మాపేందుకు శ్రీ రాఘవయ్య గారు చేసిన కృషి అంతా ఇంతా కాదు. గిరిజనుల పాలిట శాపంగా ఉన్న అనేక చట్టాలను రద్దు చేయించడంలో ఆయన ప్రధాన పాత్ర వహించారు.

అలాగే వారు గిరిజనుల స్థితి గతుల మీద, ఆచారాలపైన చాలా పుస్తకాలు వ్రాయడం విశేషం. బ్రతికినన్నాళ్ళూ దళిత, గిరిజనుల అభ్యున్నతి కోసం పరితపించిన ఆ మహనీయుడు శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య సేవలకు గాను వారికి భారత ప్రభుత్వం #పద్మభూషణ్ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది. నేడు ఆ మహనీయుని జయంతి. వారిని స్మరించుకోవడం మనందరి కర్తవ్యం.

– బూదూరు కరుణాకర్.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.