ArticlesNews

డా|| అంబేద్కర్ జయంతిని మనం అందరం ఎందుకు జరుపుకోవాలి?

1.4kviews

డా|| అంబేద్కర్ గత 17వందల సంవత్సరాలుగా అస్పృశ్యత వల్ల అవమానాలకు గురిఅవుతున్న 17 శాతం హిందువుల సామాజిక సమానత్వం కోసం వారు జనజాగరణ ఉద్యమాలు చేశారు. ప్రపంచంలో జరిగిన అనేక ఉద్యమాలు – సామాజిక సమానత్వం కోసం జరిగిన ఫ్రెంచి విప్లవంలో, అమెరికాలో తెల్లవారితో సమానంగా నల్లవారి (నీగ్రోల) సమాన హక్కుల కోసం జరిగిన ఉద్యమంలో, రష్యా, చైనాలలో జరిగిన కమ్యూనిస్టు ఉద్యమాలలో లక్షలమంది చనిపోయారు. పెద్ద రక్తపాతం జరిగింది. గాంధీజీ నాయకత్వంలో జరిగిన స్వాతంత్ర ఉద్యమంలోనూ హింసాత్మక సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. డా|| అంబేద్కర్ నిర్వహించిన సామాజిక సమానతా ఉద్యమాలలో ఒక్కచుక్క రక్తం కూడా కారలేదు. 17వందల సంవత్సరాలుగా కొనసాగిన అస్పృశ్యత, కుల అసమానతలను భారత రాజ్యాంగం ద్వారా వ్యవస్థాపూర్వకంగా నిర్మూలించిన ఘనత వీరిది. ప్రపంచంలోనే డా॥ అంబేద్కర్ గొప్ప శాంతియుత ఉద్యమకారులు.

2.హిందూ సమాజంపట్ల ఆగ్రహించారు – హిందూ సమాజ వినాశనాన్ని కోరుకోలేదు

భీమ్ రావు తన జీవితంలో అస్పృశ్యత కారణంగా అనేక అవమానాలను ఎదుర్కొన్నారు. పత్రికలద్వారా హిందువుల ఆలోచనా ధోరణిని మార్చటానికి ప్రయత్నించారు. నాసిక్ కాలరాం మందిర ప్రవేశంకోసం 18నెలలు శాంతియుతంగా సత్యాగ్రహం చేశారు.

మహారాష్ట్రలోని మహద్ గ్రామంలోని చెరువులో అందరికి ప్రవేశం ఉందని పంచాయితీ తీర్మానం చేసినా షెడ్యూలు కులాల ప్రజలతో నీటిని త్రాగడానికి వెళితే గ్రామస్థులు భౌతిక దాడులకు దిగారు. డా॥ అంబేద్కర్ చేసిన సామాజిక సమతా ఉద్యమాలకు హిందూ సమాజం నుండి ఏమాత్రం సహకారం లభించలేదు. (దీనికి మినహాయింపు వీరసావర్కార్, కుర్తికోట శంకరాచార్యులు) హిందూ సమాజంలో కాలానుగుణంగా మార్పురాదని ఆగ్రహించి , నిరాశకు గురై 1933లో “నేను హిందువుగా పుట్టాను, హిందువుగా చావను. ఏ మతంలో సమానత్వం ఉంటుందో ఆ మతాన్ని స్వీకరిస్తాను.” అని బహిరంగ ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో హిందూ సమాజంలో కొంత కదలిక ఏర్పడింది.

3. డా|| అంబేద్కర్ హిందూవ్యతిరేకా ? కాదు :

‘కులనిర్మూలన’ అనే ప్రసంగంలో కులవిభజనవల్ల , కుల అసమానతలవల్ల, కుల వ్యవస్థ వల్ల హిందూ సమాజం సమైక్యంగా లేదు, ఫలితంగా మనం బానిసలు అయ్యాం. విదేశీ పాలనలో అనేకమంది ముస్లిం మతస్థులయ్యారు. వారు వెనక్కి రావాలంటే ఏ కులంలోకి రావాలి? వారు ఏకులంలోకి రాగలరు? ప్రపంచంలో ఇస్లాం, క్రైస్తవాలు మతప్రచారం, మతం మార్పిడి చేస్తున్నాయి. ఇతరులను తమ మతంలోకి మార్చుకుంటున్నారు. వారి బలం పెరుగుతోంది. ఎవరైనా ఇతర మతస్థులు తమ మతం వదిలి హిందూమతంలోకి రావాలంటే నేటి కులవ్యవస్థ వారి ప్రవేశానికి అడ్డుగా ఉంది. ఇది హిందూ సమాజానికి పెద్ద సమస్య. ఇలా సాగింది. వారి ప్రసంగం. వారిమొత్తం ప్రసంగం హిందూ సమాజ హితంకోసమే ఉన్నది. నిజమేకదా?

4. హిందూ తత్వచింతనలో ఉన్న గొప్పతనాన్ని వారు గుర్తించారు.

హిందూ తత్వచింతనలో మాత్రమే “భగవంతుడు అందరిలో ఉ న్నాడు అనే ఆలోచన ఉన్నది. మరెక్కడా లేదు. ఈ ఆలోచనద్వారా సామాజిక సమానత్వం సాధ్యం. కాని హిందూతత్వ చింతనలోని శ్రేష్టత్వానికి – ఆచరణలో ఉన్న అసమానతలకు ఈ అంతరమే ప్రధాన సమస్య. అంతరాన్ని తొలగించాల్సింది ఎవరు? మనం తయారుగా ఉన్నామా ? ఈ అంతరం పోవాలి” అని వారు కోరారు.

5. హిందూ శబ్దానికి విస్తృత నిర్వచనం:

డా|| అంబేద్కర్ న్యాయశాఖా మంత్రిగా హిందూకోడ్ బిల్లును ఎంతో శ్రమించి వారు రూపొందించారు. ఈ సందర్భంగా హిందూ అంటే ఎవరూ? అని నిర్వచిస్తూ “ముస్లింలు, క్రైస్తవులు, పారశీకులు కాని భారతీయులందరూ హిందువులు,”అని వారు నిర్వచించారు. హిందుత్వానికి విస్తృతమైన, సమగ్రమైన నిర్వచనం వారు కొందరు సిక్కులు “మేము హిందువులం కాదు అని మాట్లాడగా మీరు హిందువులు ఎట్లాకాదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీదే” అని వారు ఎదురు ప్రశ్న వేశారు.

6. డా|| అంబేద్కర్ – వారి ఆలోచనలు

1916లో “భారతదేశంలో కులాల పుట్టుపూర్వోత్తరాలు” అనే పరిశోధన గ్రంథంలో కుల అసమానతలు ఉన్నా ప్రపంచంలోని ఏ సమాజంలో లేని సాంస్కృతిక ఐక్యత (Cultural Unity) హిందూ సమాజంలో మాత్రమే ఉందని వారు విశ్లేషించారు. వేదకాలంలో గల చాతుర్వర్ణ వ్యవస్థలో వర్ణాలు మధ్య హెచ్చుతగ్గులు లేవని “శూద్రులు ఎవరు?” అనే గ్రంథంలో వివరంగా పేర్కొన్నారు. వేదమంత్రాలను దర్శించిన ఋషులు అన్ని వర్ణాలలో ఉన్నారని, మహిళలు సైతం ఉన్నారని వారు సోదాహరణంగా వివరించారు. హిందూ సమాజంలో చిచ్చు పెట్టడానికి ఆంగ్లేయ పాలకులు ‘ఆర్య – ద్రావిడ’ అనే అభూత సిద్ధాంతాన్ని కల్పించారని వారు వివరించారు. అస్పృశ్యత మధ్యకాలంలో క్రీ.శ 4-5 శతాబ్దాలలో వచ్చినదని ‘అస్పృశ్యులు ఎవరు?” అనే గ్రంథంలో నిరూపించారు. 1956 నేపాల్ ప్రపంచ బౌద్ధధర్మ సభలో మార్క్సిజం కంటే మానవ సమగ్ర వికాసానికి బౌద్ధమే మేలు అని వివరంగా ప్రసంగించారు.

7. డా|| అంబేద్కర్ – సంస్కృతం

అంటరాని కులంలో జన్మించిన కారణాన విద్యార్ధిగా భీమ్ రావ్ కు సంస్కృతం నేర్చుకోవటానికి అవకాశం లభించలేదు. పెద్దవాడయిన పిదప కొందరు పండితుల సహకారంతో సంస్కృతం నేర్చుకున్నారు. భారత జాతీయ భాషగా (వ్యవహారిక భాషగా) సంస్కృతం ఉండాలని వారు ప్రకటించారు. (1928 The Times of India) రాజ్యాంగం తయారీ సందర్భంగా సంస్కృతానికి పెద్దపీటవేయాలని డా. అంబేద్కర్ ప్రయత్నించారు. జాతీయ భాషగా సంస్కృతాన్ని సమర్ధించే విషయమై 10 డిశెంబరు, 1949లో షెడ్యూల్డు కులాల ఫెడరేషన్ కార్యవర్గంలో ఒక తీర్మానం చేయాలని డా|| అంబేద్కర్ ప్రయత్నించారు. బి.పి. మౌర్య వంటి యువనాయకులు వ్యతిరేకించటంతో తీర్మానం వీగిపోయింది. ఎనిమిదవ షెడ్యూల్డులో మిగిలిన భాషలతో సమానంగా సంస్కృతానికి సమాన స్థానం కల్పించబడింది.

8. భారత రాజ్యాంగం ద్వారా ఒకే రాష్ట్రంగా (Nation) భారతదేశం

సాంస్కృతిక సమైక్యతతోపాటు సామాజిక సమైక్యత అవసరమని తెలియజేస్తూ భారత రాజ్యాంగం ద్వారా సామాజిక సమానత్వం అనే అమృతాన్ని అందించారు. సాంస్కృతిక భారతి తోపాటు, బలమైన సమైక్య రాజకీయ భారతం అవసరమని భావిస్తూ బలమైన కేంద్రంగల భారత రాజ్యాంగాన్ని మనకందించారు.  ఒకే ప్రజనుండి ఒకే రాజ్యం ­- ఒకే రాష్ట్రం వైపు భారత్ రూపొందే విధంగా భారత రాజ్యాంగాన్ని డా|| అంబేద్కర్ అందించారు. డా అంబేద్కర్ ఈ శతాబ్దపు మేధావి. అనేక రంగాలలో వారు ఎంతో అధ్యయనం చేశారు. కనుకనే భారత రాజ్యాంగ నిర్మాతగా వారికి అవకాశం లభించింది.

9. ఆర్.ఎస్.ఎస్.తో సత్సంబంధాలు:

హిందూ సమాజంపట్ల ఆగ్రహంగా ఉన్నా ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తల ఆహ్వానం మేరకు 12 మే, 1939న పూనాలో ఆర్.ఎస్.ఎస్. సంస్థాపకులు డా|| హెడ్గేవార్ తో కలిసి ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తల 40రోజుల శిక్షణా శిబిరంలో ఒక రోజు పాల్గొన్నారు. 425మంది కార్యకర్తలు పాల్గొన్న ఆ శిబిరంలో 100కు పైగా షెడ్యూల్డు కులాల కార్యకర్తలు ఉండడం చూసి ఎంతో ఆనందాన్ని వ్యక్తంచేశారు. తాను ఆశించిన సామాజిక సమానతా కార్యాన్ని ఆర్.ఎస్.ఎస్. మౌనంగా చేస్తున్నదని వారు శ్లాఘించారు. హిందూ సమాజ సంఘటన చేస్తున్న ఆర్.ఎస్.ఎస్. పట్ల వారు ఎప్పుడూ ఒక పల్లెత్తుమాట అనలేదు. 1956వరకు దత్తోపంత్ రేంగ్డే వంటి కార్యకర్తలు వారితో సత్సంబంధం కలిగి ఉన్నారు. డా|| అంబేద్కర్ ను డాక్టర్ జీ ఒకసారి, గురూజీ ఒకసారి కలిశారు. ఆర్.ఎస్.ఎస్. చేస్తున్న హిందూసమాజ సంఘటనాకార్యం పెరుగుతున్న జనాభా, దేశ సమస్యలు దృష్ట్యా తక్కువ వేగంతో ఉన్నదని వారు అసంతృప్తిని మాత్రం వ్యక్తంచేశారు. “తన అనుచరులు ఎక్కువకాలం నిరీక్షిస్తూ ఉండలేరని, తాను ఉండగానే వారికి ఒకదారి చూపించాలని”, డా|| అంబేద్కర్ 1956లో శ్రీ ఠేంగ్డేజీ తో అన్నారు.

10. ‘భారతదేశ విభజన – పాకిస్థాన్ ఏర్పాటు అనే గ్రంథంలో కోట్ల సంఖ్యలో ఉన్న ముస్లింలను కలుపుకునే శక్తి హిందూసమాజంలో లేదని, కనుక పాకిస్థాన్ ఏర్పడటమే మిగిలిన భారతదేశంలోని హిందువులకు మేలు కలిగిస్తుందని అన్నారు. పాకిస్థాన్ ఏర్పడిన తరువాత హిందూ ముస్లిం జనాభా మార్పిడి జరగాలని వారు కోరారు. పాకిస్తాన్లో హిందువులకు, షెడ్యూల్ కులాల వారికి ఏమాత్రం రక్షణ ఉండదని వారు చెప్పిన జోస్యం నేడు నిజమైందికదా? జమ్మూ – కాశ్మీర్ రాజ్యానికి 370 అధికరణ ఇవ్వటాన్ని వారు వ్యతిరేకించారు.

11. బౌద్ధ ధర్మాన్ని వారు ఎందుకు స్వీకరించారు? :

1933లో హిందూమతాన్ని వదులుతానని వారు ప్రకటించినా 1956వరకు వారు ఏ నిర్ణయం తీసుకోలేదు. ముస్లిం, క్రైస్తవ వర్గాల నుండి ఎన్నో ఆకర్షణలు లభించినా వారు అటువైపు మొగ్గలేదు. ముస్లిం లేదా క్రైస్తవ మతాన్ని స్వీకరించటంవల్ల దేశానికి పెద్ద ప్రమాదం ఏర్పడుతుందని వారు గుర్తించారు. కనుక భారతదేశంలో జన్మించిన బౌద్ధధర్మాన్ని 1956లో నాగపూర్ లో స్వీకరించారు. వారి చర్య హిందూ సమాజానికి పరోక్షంగా ఎంతో మేలు చేసింది.

12. దేశ ప్రయోజనాలకే పెద్దపీట:

భారత రాజ్యాంగం తుది సమావేశంలో 25 నవంబర్, 1949 న ప్రసంగిస్తూ “నేడు మనకు లభించిన స్వాతంత్రం సుస్థిరంగా ఉండాలంటే మనం మనకులము, ప్రాంతము, పార్టీ, సంస్థల ప్రయోజనాలకంటే దేశప్రయోజనాలకు పెద్దపీటవేయాలి” అని అందరకూ పిలుపునిచ్చారు.

13. డా|| అంబేద్కర్ జాతీయ నాయకులు

డా|| అంబేద్కర్ దళితుల ఉన్నతికోసం, సమానత్వం కోసం పనిచేస్తూనే భారతదేశ ప్రయోజనాల కోసం అహరహమూ శ్రమించారు. ఎక్కడా రాజీ పడలేదు. కనుక వారిని మనం జాతీయ నాయకుడిగా గుర్తించి గౌరవించాలి. ఇది మనందరి బాధ్యత.

– కే. శ్యాంప్రసాద్, సామాజిక సమరసతా వేదిక ర్రాష్ట్ర సంఘటనా కార్యదర్శి.  

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.