
దేశంలో కరోనా ప్రభావం నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో వైరస్‌ను నియంత్రించేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న 21 రోజుల లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. ఈ మేరకు ఆయన జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. కరోనాపై విజయం సాధించడానికి సప్త సూత్రాలు పేరిట ఆయన 7 సూత్రాలను ప్రజలకు వివరించారు. వాటిని కచ్చితంగా అమలు చేసినట్లయితే తప్పకుండా కరోనాపై విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ప్రధాని సూచించిన సప్త సూత్రాలు…
వృద్ధుల సంరక్షణకు చర్యలు తీసుకోండి
ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడి మరణించిన వారిలో వృద్ధులే ఎక్కువ. ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు, శ్వాససంబంధిత సమస్యలు ఉన్నవారిలో ఈ వైరస్‌ను నియంత్రించడం కష్టంగా మారింది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా వైద్యులు, నిపుణులు వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరుతున్నారు. వీరిని రక్షించుకుంటే వైరస్‌బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య నియంత్రణలోకి వస్తుంది. ఒకవేళ వీరు కొవిడ్‌కు బాధితులుగా మారితే.. వారి చికిత్స, సంరక్షణ పేరిట కుటుంబ సభ్యులంతా ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. దీంతో మిగిలినవారూ వైరస్ బారిన పడే ముప్పు పెరుగుతుంది. అందుకే వీరిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరాన్ని ప్రధాని గుర్తుచేశారు. |
ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో చైనా సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించుకుంది. అందులో భాగంగా రోబోలు, బిగ్ డేటా, ప్రత్యేక యాప్‌లను వినియోగించింది. అదే బాటలో భారత్‌లోనూ కరోనా వైరస్‌కు సంబంధించి పూర్తి సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవడం కోసం కేంద్ర ప్రభుత్వం ‘ఆరోగ్య సేతు’ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా కరోనా నుంచి మీరు ఎంత సురక్షితంగా ఉన్నారో తెలుస్తుంది. అంతేకాకుండా కరోనా వైరస్ సోకిన వ్యక్తులు ఉన్న సమీప ప్రాంతానికి మీరు వెళ్లినట్లయితే వెంటనే ఈ యాప్ మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. కరోనా వైరస్ లక్షణాలు ఉన్నవారికి యాప్ ద్వారా వైద్య సలహాలు, పరీక్షా కేంద్రాల సమాచారాన్ని అందిస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఒక కోటి మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు సమాచారం. భవిష్యత్తులో కూడా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగే అవకాశం ఉంది. ఆ సమయంలో ప్రయాణాలకు ఈ యాప్ ద్వారానే అనుమతులు జారీ చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. |
పేదలకు చేయగలిగినంత సాయం చేయండి
లాక్‌డౌన్ అమలులో ఉన్న సమయంలో దేశవ్యాప్తంగా అనేక మంది పేదలు సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వీరిలో చాలా మంది దినసరి కూలీలు, కార్మికులు ఉపాధి కోల్పోయారు. కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అనేక మంది దాతలు స్థానికంగా వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్న సంఘటనలు చూశాం. కొంతమంది భోజన వసతులు ఏర్పాటు చేయడం, మరికొంత మంది నిత్యావసర వస్తువులు అందజేయడం వంటి సత్కార్యాలకు శ్రీకారం చుట్టారు. తద్వారా ఈ పోరు వారి జీవితాల్లో భారంగా మారకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా లాక్‌డౌన్‌ను మరికొంత కాలం పొడిగించిన నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాలను మరింత ముమ్మరంగా చేస్తూ పేదలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. |
వైద్య, పారిశుద్ధ్య, పోలీసు సిబ్బందిని గౌరవించండి
కరోనా వైరస్ మహమ్మారి పోరులో సైనికులుగా సేవలందిస్తున్న వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులను గౌరవించాలని ప్రధాని సూచించారు. ప్రాణాలను పణంగా పెట్టి కరోనా సోకిన వారికి వైద్యసేవలు అందిస్తోన్న వైద్యులను, వైద్య సిబ్బందిని గౌరవించాలి. అంతేకాకుండా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో పరిసరాలను, ఆసుపత్రులను అనుక్షణం శుభ్రపరుస్తున్న పారిశుద్ధ్య కార్మికులను కూడా గౌరవించాలని ప్రధాని సూచించారు. |
సహోద్యోగులు, మీ వద్ద పనిచేసే వారికి అండగా నిలవండి
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారితో ఇప్పటికే చాలా కంపెనీలు, పరిశ్రమలు తాత్కాలికంగా మూతపడ్డాయి. రానున్న రోజుల్లో ఉద్యోగాలు కోల్పోతామనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికాలో దాదాపు రెండు కోట్ల ఉద్యోగాలు కుచించుకుపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. అనేక మంది నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అక్కడి ప్రభుత్వమే పేర్కొంది. ఇటు మన దేశంలోనూ ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తున్న విషయం తెలిసిందే. దీంతో అనేక మంది ఉద్యోగులు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనోనిబ్బరంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే మీ కార్యాలయాల్లోని తోటి ఉద్యోగులకు తోచిన సహాయం చేస్తూ చేదోడువాదోడుగా నిలవాలి. తద్వారా వారిలో నెలకొన్న భయాలను తొలగించే ప్రయత్నం చేయాలని ప్రధానమంత్రి సూచించారు. |
భౌతిక దూరం మరువద్దు, మాస్కులు విధిగా ధరించండి
భౌతిక దూరం పాటించడం.. ఇదే ఇప్పుడు మహమ్మారిని కట్టడి చేయడానికి ఉన్న మేలైన ఔషధం. ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఉన్నంతకాలం వైరస్ ముప్పు నుంచి మనం తప్పింకుకున్నట్లే. ఇక నిత్యావసర వస్తువులు లేదా మరే ఇతర అత్యవసర పనుల కోసం బయటకు వెళ్లినప్పుడు ఇతరుల నుంచి కనీసం రెండు మీటర్ల ఎడం పాటిస్తే.. వైరస్‌ను దాదాపు అరికట్టినట్లే. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూరగాయాలు, నిత్యావసర దుకాణాల వల్ల ప్రజలు విధిగా మీటరు దూరం పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న సందర్భాలు చూశాం. అలాగే మాస్కులు ధరించడం కూడా మహమ్మారి మెడలు వంచేందుకు మరో మార్గం. వైరస్ సోకిన వ్యక్తి తుంపర్ల నుంచే ఇది ఇతరులకు వ్యాపిస్తున్నట్లు అధ్యయనాలు తేల్చాయి. మాస్కులు ధరించడం వల్ల తుంపర్లు ఇతరులపై పడకుండా జాగ్రత్తపడవచ్చు. |
రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోండి
కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో రోగనిరోధక శక్తి ఎంతో కీలకం. ఇదే విషయాన్ని ప్రస్తావించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైరస్ విజృంభిస్తోన్న సమయంలో పోషక ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకొనేందుకు ఆయుష్ మంత్రిత్వశాఖ పేర్కొన్న సూచనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. Source : Enadu. |