
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు అన్ని ప్యాసింజర్ రైళ్లు, మెట్రో, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. వైరస్ బారిన పడి ఇప్పటికే దేశంలో ఆరుగురు మరణించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి మార్చి 31 అర్ధరాత్రి వరకు అన్ని ప్యాసింజర్ సర్వీసులనూ రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. కేవలం గూడ్స్ రైళ్లు మాత్రమే నడవనున్నాయని తెలిపింది. అయితే ఇప్పటికే ప్రారంభమైన రైళ్లు మాత్రం వాటి గమ్య స్థానాలను చేరే వరకు అనుమతిస్తామని తెలిపింది.
మెట్రో రైళ్లు సైతం 31 వరకు నిలిచిపోనున్నాయి. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ఇప్పటికే మెట్రో రైళ్లు తిరగడం లేదు. ఈ నెలాఖరు వరకు వాటి సేవలను కేంద్రం నిలిపివేసింది. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను నిలిపివేయాలని కేంద్రం సూచించింది. అలాగే అవసరమమైన ప్రయాణాలకు మాత్రమే అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే జనతా కర్ఫ్యూ కారణంగా ఇవాళ రైళ్లు, బస్సు సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలసిందే.





