
కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది. ఆర్థికంగా, సాంకేతికంగా మనకంటే ఎంతో ముందున్న అభివృద్ధి చెందిన దేశాలు కూడా కరోనా బారినపడి విలవిల్లాడిపోతున్నాయ్.
ఈ విషయంలో మన దేశం అప్రమత్తంగా వ్యవహరించిందనే చెప్పాలి. చైనాలో పురుడు పోసుకున్న కరోనా ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. తమ దేశంలో కరోనా బారినపడ్డ వారి, మృత్యువాత పడ్డ వారి సంఖ్య విషయంలో చైనా కల్లబొల్లి కహానీలు వినిపిస్తున్నదనే వాదన కూడా వినిపిస్తోంది. చైనాతో అతి పెద్ద సరిహద్దును కలిగి ఉన్న దేశం అయి ఉండి కూడా భారత్ ఆందోళన చెందాల్సినంతగా కరోనా బారిన పడలేదనే చెప్పాలి. అంతమాత్రాన కరోనా విషయంలో ఏమరపాటు పనికిరాదు.
కరోనా మహమ్మారిని ఎదుర్కునేందుకు మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంసిద్ధత ప్రస్తుతానికి సంతృప్తికరంగానే తోస్తున్నది. గురువారం సాయంత్రం ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంతో కరోనా యొక్క తీవ్రత దేశ ప్రజలకు అర్థమయ్యే ఉంటుంది.
ప్రభుత్వ ఉద్యోగులు సైతం ఇంటి వద్ద నుంచే సేవలు అందించే ఏర్పాట్లు ప్రభుత్వాలు చేశాయి. పాఠశాలలకు, కళాశాలలకు శెలవులు ప్రకటించడం తోపాటు ప్రసిద్ధ దేవాలయాలలో దర్శనాలను నిలిపి వేయడం, షాపింగ్ మాల్స్, సినిమా హాళ్ళను మూసివేయడం వంటి చర్యలతో ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకున్నాయి. అలాగే ప్రైవేటు కార్యాలయాలు, సాఫ్ట్ వేర్ రంగ ఉద్యోగులకు సైతం తమ ఇంటి నుంచే విధులు నిర్వహించేలా ఆయా సంస్థలు అనుమతులు ఇస్తున్నాయి. మరికొందరు స్వచ్ఛందంగానే తమ వ్యాపార కార్యకలాపాలకు కొంత విరామం పాటించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం….. తమ వ్యాపార వ్యవహారాలకు ఇలా కొన్ని రోజుల పాటు విరామం ప్రకటించినా కూడా ఇలాంటి వారికి వారి దైనందిన జీవనానికి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు.
కానీ ఏరోజుకారోజు పని చేసుకుంటే గానీ, రెక్కాడితే గానీ డొక్కాడని వారి పరిస్థితి ఏమిటి? కరోనా భయం కారణంగా ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోతే రోజువారి కూలి చేసుకుని జీవించే దినసరి కూలీల పరిస్థితి ఏమిటి? ముఖ్యంగా రాకపోకలు, ప్రయాణాలు పూర్తిగా నిలచిపోయిన ప్రస్తుత తరుణంలో రిక్షావాలాలకు, ఆటోవాలాలకు, టాక్సీ వాలాలకు పెద్దగా పని ఉండే అవకాశం లేదు. మరి వారికి ఆదాయం ఎలాగ?
ఈనెల 22వ తేదీ ఆదివారం దేశ ప్రజలందరూ స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూని పాటించాలని ప్రధాని పిలుపునిచ్చారు. మరి ఆరోజు వారి ఆదాయం పూర్తిగా కోల్పోయినట్లే కదా? మరి వారికి ప్రత్యామ్నాయం ఏమిటి? దీని పైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారిస్తే మంచిది.
అంతేకాకుండా కరోనా వంటి అంటు వ్యాధులు మురికివాడలలోనూ, ఫుట్ పాత్ ల మీద నివసించే అభాగ్యులకు సోకే అవకాశం ఎక్కువ. పైగా జన సంచారం లేక, పనులు లేని కారణంగా వారికి పూటగడవని స్థితి నెలకొంటుంది. రిక్షా తొక్కుకుంటూనో, పూసలు, పిన్నీసులు, దువ్వెనలు వంటివి అమ్ముకుంటూనో జీవించే వారికి పొట్ట గడచే మార్గం ఎలా? వీరికి ప్రత్యేకంగా ఏదైనా వసతులు కల్పించే దిశగా ప్రభుత్వాలు యోచన చెయ్యాల్సిన అవసరం ఉంది.
ఈ విషయంలో స్వచ్ఛంద సేవా సంస్థలు, మిగిలిన ప్రజలు కూడా తమ వంతు సాయం చేసే దిశగా ప్రయత్నించాలి. ఇలాంటి విపత్కర పరిస్థితులలో కేవలం ప్రభుత్వాల బాధ్యతగా భావించకుండా ప్రతి ఒక్కరూ ఉదార హృదయంతో వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది.
అటువంటి వారికి అవసరమైన మందులను, ఆహారాన్ని అందించడం, వారి పరిసరాలలో పరిశుభ్ర వాతావరణాన్ని కల్పించడం వంటివి చేయగలిగిన, చేయవలసిన పనులు. కరోనాను నివారించడం, వ్యాప్తిని నిరోధించడం, నిర్భాగ్యులను ఆదరించడం మనందరి బాధ్యత. కనుక అందరం బాధ్యతగా మెలగుదాం…. విపత్తును సమైక్యంగా ఎదుర్కొందాం.





