
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా బిసూర్ గ్రామంలో వేధింపులు ఎదుర్కొంటున్నామని ఆరోపిస్తూ పది హిందూ కుటుంబాలు గ్రామాన్ని విడిచిపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించాయి. ఈ ఘటనపై స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
బాధిత కుటుంబాల కథనం ప్రకారం, గ్రామంలోని మసీదుకు ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి కొందరు వ్యక్తులు తరచూ వస్తున్నారని, వారు మసీదు పరిసరాల్లో గుమికూడి స్థానిక హిందువులను వేధిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా హిందూ మహిళలు, బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం, హిందూ మతంపై అవమానకర వ్యాఖ్యలు చేయడం వంటి సంఘటనలు జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు.
ఈ విషయాన్ని ప్రశ్నించినప్పుడు, “అసౌకర్యంగా ఉంటే ఇళ్ల తలుపులు, కిటికీలు మూసుకుని ఉండండి” అంటూ బెదిరించారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. గ్రామ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంపై హిందూ ఏక్తా ఆందోళన్ స్పందించింది. సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నితిన్ షిండే మాట్లాడుతూ, బిసూర్ గ్రామంలోని మసీదుకు వస్తున్న బయటి వ్యక్తుల వివరాలపై పోలీసులు సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గ్రామంలో శాంతిభద్రతల దృష్ట్యా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ స్వయంగా జోక్యం చేసుకుని బాధిత కుటుంబాలకు రక్షణ కల్పించాలని కోరారు.
అలాగే, ఈ వ్యవహారంలో పోలీసులు సత్వర చర్యలు తీసుకోవాలని, లేకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హిందూ ఏక్తా ఆందోళన్ హెచ్చరించింది.





