మారుతున్న కాలానికి హిందుత్వ: దేశ విభజన కుట్రలను తిప్పికొట్టే ఏకైక బంధన శక్తి : శ్రీ నందకుమార్

ప్రజ్ఞా భారతి అఖిల భారత సంయోజక్ శ్రీ నందకుమార్ రచించిన “మారుతున్న కాలానికి హిందుత్వం” (‘Hindutva for the Changing Times’) పుస్తకావిష్కరణ కార్యక్రమం విజయవాడలో ఘనంగా జరిగింది.
విజయవాడలోని శ్రీ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో శనివారం (20-06-2026) సాయంత్రం 6.30 గంటలకు నిర్వహించిన ఈ సభకు మేధావులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.మారుతున్న కాలానికి అనుగుణంగా హిందుత్వం యొక్క ప్రాసంగికత, భారతీయ ధార్మిక నాగరికత విశిష్టత, బహుళ సాంస్కృతిక దృక్పథం, జాతీయ ఏకత్వంలో హిందుత్వ పాత్ర వంటి అంశాలపై సభలో విస్తృతంగా చర్చ జరిగింది.
ఈ సందర్భంగాశ్రీ జె. నందకుమార్ మాట్లాడుతూ, ఒక దేశం యొక్క భౌగోళిక సరిహద్దులను కేవలం సైనిక శక్తి లేదా రాజకీయ వ్యవస్థలు మాత్రమే రక్షించలేవు. ఆ దేశ ప్రజలను అంతర్గతంగా ఒకే భావజాలంతో, ఒకే నాగరికతా స్పృహతో అనుసంధానించే సాంస్కృతిక అంతస్సూత్రమే దాని అసలైన బలమని పేర్కొన్నారు. వేల ఏళ్ల చరిత్ర, సంప్రదాయాలు, విలువలతో కూడిన భారత నాగరికతకు ఆ బంధన శక్తి ‘హిందుత్వం’ అని ఆయన అభివర్ణించారు.ఇటీవలి కాలంలో హిందుత్వ భావనపై ప్రణాళికాబద్ధమైన సైద్ధాంతిక దాడులు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఒకవైపు దేశవ్యాప్తంగా హిందుత్వ భావజాలానికి ప్రజల మద్దతు పెరుగుతుండగా, మరోవైపు కొన్ని వర్గాలు దానిని ప్రతికూలంగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో హిందుత్వం అంటే ఏమిటి? అది కేవలం రాజకీయ భావజాలమా లేదా భారతీయ నాగరికత యొక్క సాంస్కృతిక స్వరూపమా? మారుతున్న ప్రపంచ పరిస్థితుల్లో దాని ప్రాసంగికత ఏమిటి? వంటి ప్రశ్నలపై సమాజంలో విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
బాబాసాహెబ్ అంబేద్కర్, నేతాజీల దృష్టిలో సాంస్కృతిక ఏకత్వం
డా. బి.ఆర్. అంబేద్కర్ 1916లో సమర్పించిన పరిశోధన పత్రంలో భారతదేశ సాంస్కృతిక ఐక్యతను ప్రత్యేకంగా ప్రస్తావించారని నందకుమార్ గుర్తుచేశారు. అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా భారతదేశం ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఒకే సాంస్కృతిక ఆత్మతో నిండి ఉందని పేర్కొన్నారని చెప్పారు.ఈ మహనీయులు ఏ రాజకీయ సంస్థకు చెందినవారు కాకపోయినా, దేశాన్ని కలిపి ఉంచే శక్తిని స్పష్టంగా గుర్తించారని ఆయన అన్నారు.
సంఘ్ ఆవిర్భావం – దేశ విభజన శక్తుల సవాలు
భారతదేశాన్ని సాంస్కృతికంగా ఏకం చేసి ఉంచే శక్తిగా హిందుత్వం ఎదిగిన నేపథ్యంలో, దేశాన్ని భాష, ప్రాంతం, కులం వంటి అంశాల ఆధారంగా విభజించాలనుకునే శక్తులకు అది ప్రధాన అడ్డంకిగా మారిందని శ్రీ జె. నందకుమార్ వ్యాఖ్యానించారు.1925 సంవత్సరాన్ని ప్రస్తావిస్తూ, ఒకవైపు డాక్టర్ కేశవ్ బాలిరాం హెడ్గేవార్ నాయకత్వంలో నాగపూర్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భవించగా, మరోవైపు అంతర్జాతీయ కమ్యూనిస్టు వర్గాల్లో భారతదేశ భవిష్యత్తుపై భిన్నమైన రాజకీయ విశ్లేషణలు వెలువడ్డాయని ఆయన పేర్కొన్నారు.భారతదేశంలో భాష, ప్రాంతం, కులాల ఆధారంగా భవిష్యత్తులో అంతర్గత విభేదాలు పెరిగే అవకాశం ఉందని అప్పటి కమ్యూనిస్టులు విశ్లేషించారని, అలాంటి పరిస్థితులను రాజకీయ అవకాశాలుగా మలచుకోవాలనే ధోరణి కూడా కనిపించిందని ఆయన అన్నారు. నేటికీ కొన్ని వామపక్ష, మతతత్వ మరియు విచ్ఛిన్నకర శక్తులు సమాజంలోని విభజన రేఖలను మరింత లోతుగా చేసే ప్రయత్నం చేస్తున్నాయని నందకుమార్ అభిప్రాయపడ్డారు. అయితే భారతదేశాన్ని ఒకే నాగరికతా దృక్పథంతో, సాంస్కృతిక బంధంతో అనుసంధానించే హిందుత్వమే అలాంటి విభజన ప్రయత్నాలకు సమర్థమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.దేశ ఐక్యతను కాపాడటంలో రాజకీయ వ్యవస్థల కంటే సమాజాన్ని కలిపి ఉంచే సాంస్కృతిక చైతన్యమే కీలకమని, అదే హిందుత్వం యొక్క అసలైన శక్తి అని ఆయన వివరించారు.
హిందూ పదానికి వేల ఏళ్ల చరిత్ర
‘హిందూ’ అనే పదం బ్రిటీష్ కాలంలో పుట్టిందనే వాదన అసత్యమని నందకుమార్ పేర్కొన్నారు. ప్రాచీన గ్రంథాలు, విదేశీ యాత్రికుల రచనలు, గురునానక్ దేవ్ వంటి మహనీయుల వచనాల్లో ‘హిందూ’, ‘హిందుస్తాన్’ పదాలు కనిపిస్తాయని ఆయన వివరించారు.అందువల్ల హిందుత్వ అనేది ఆధునిక రాజకీయ నిర్మాణం కాదని, వేల ఏళ్ల సాంస్కృతిక గుర్తింపని ఆయన స్పష్టం చేశారు.
హిందుత్వ: ఒక ప్రవాహం, మూస సిద్ధాంతం కాదు
“హిందుత్వ అనేది ఒక ‘ఇజం’ కాదు; అది నిరంతర పరిణామం చెందే జీవన ప్రవాహం” అని ఆయన అన్నారు.డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ అభిప్రాయాలను ప్రస్తావిస్తూ, హిందుత్వ సత్యాన్వేషణకు అవకాశం ఇచ్చే ఓపెన్ సిస్టమ్ అని వివరించారు. కాలానుగుణంగా మార్పులను స్వీకరిస్తూనే, మూల విలువలను కాపాడుకోవడం హిందుత్వ ప్రత్యేకత అని పేర్కొన్నారు.
వైఖరి మార్చుకున్న సూడో-సెక్యులర్ రాజకీయాలు
హిందుత్వంపై విమర్శలు గుప్పించే వర్గాల వైఖరిలో కాలక్రమేణా వచ్చిన మార్పును కూడా శ్రీ నందకుమార్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఒకప్పుడు దేశ రాజకీయ, మేధో వర్గాల్లో హిందూ గుర్తింపును బహిరంగంగా అంగీకరించేందుకు వెనుకంజ వేసిన నేతలు, ఆలోచనాపరులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు.మోతీలాల్ నెహ్రూ విదేశీ పర్యటనలో తనను ‘హిందూ’గా నమోదు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారనే ప్రస్తావనను గుర్తుచేసిన ఆయన, జవహర్‌లాల్ నెహ్రూ తనను తాను “Accidental Hindu”గా అభివర్ణించుకున్న విషయాన్ని ఉదహరించారు. అలాగే కేరళ మాజీ ముఖ్యమంత్రి ఈ.ఎం.ఎస్. నంబూద్రిపాద్ కూడా తన హిందూ గుర్తింపుపై ప్రశ్నలు లేవనెత్తిన సందర్భాలను ప్రస్తావించారు.ఒక దశలో ‘Why I am not a Hindu’ వంటి రచనలు వెలుగులోకి వచ్చినప్పటికీ, నేడు అదే రాజకీయ, మేధో వర్గాలకు చెందిన కొందరు వ్యక్తులు ‘Why I am a Hindu’ వంటి రచనల ద్వారా తమ హిందూ గుర్తింపును బహిరంగంగా ప్రకటిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఒకప్పుడు హిందూ అనే పదాన్ని రాజకీయంగా దూరం పెట్టేందుకు ప్రయత్నించిన వర్గాలు, నేడు ప్రజాభిప్రాయం మారుతున్న నేపథ్యంలో అదే గుర్తింపును స్వీకరించే పరిస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు.
ప్రతి రంగంలో ప్రతిధ్వనించిన హిందూ చైతన్యం
భారత జాతీయ చైతన్య వికాసంలో ‘హిందూ’ అనే పదం కేవలం మతపరమైన గుర్తింపు మాత్రమే కాకుండా, నాగరికతా స్వరూపాన్ని ప్రతిబింబించే సాంస్కృతిక భావనగా నిలిచిందని శ్రీ నందకుమార్ పేర్కొన్నారు. 19వ శతాబ్దం చివరి దశ నుంచి 20వ శతాబ్దం ప్రారంభం వరకు దేశంలోని మేధావులు, సంస్కర్తలు, జాతీయవాదులు తమ రచనలు, సంస్థలు, ఉద్యమాల ద్వారా ఈ భావజాలాన్ని గర్వంగా ప్రతిపాదించారని ఆయన గుర్తుచేశారు.1867లో నవగోపాల్ మిత్రా ప్రారంభించిన ‘హిందూ మేళా’ స్వదేశీ, జాతీయ చైతన్యానికి కేంద్రబిందువుగా నిలిచిందని ఆయన తెలిపారు. ఈ ఉద్యమ ప్రభావం రవీంద్రనాథ్ ఠాగూర్ కుటుంబం, స్వామి వివేకానందుడి కుటుంబం వంటి అనేక జాతీయవాద వర్గాలపై పడిందన్నారు.1878లో జీ. సుబ్రమణ్య అయ్యర్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ‘ది హిందూ’ పత్రిక జాతీయవాద ఆలోచనలకు వేదికగా నిలిచిందని వివరించారు. అలాగే ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే రచించిన “History of Hindu Chemistry”, హరబిలాస్ శారద రచించిన “Hindu Superiority”, కాశీ ప్రసాద్ జైస్వాల్ రచించిన “Hindu Polity”, మహాత్మా గాంధీ రచించిన “Hind Swaraj” వంటి గ్రంథాలు భారతీయ నాగరికత, స్వరాజ్య భావన, సాంస్కృతిక ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించాయని పేర్కొన్నారు.
AI యుగంలో హిందుత్వ ప్రాముఖ్యత
కృత్రిమ మేధ (AI), డేటా నియంత్రణ, అల్గోరిథమ్ ఆధారిత సమాజం వంటి ఆధునిక సవాళ్లను ఎదుర్కొనేందుకు భారతీయ జ్ఞాన సంపద కీలకమని నందకుమార్ తెలిపారు.ధ్యానం, యోగా, చేతనాభివృద్ధి వంటి భారతీయ ఆలోచనలే మానవ స్వాతంత్ర్యాన్ని కాపాడగలవని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత విద్యా వ్యవస్థ కేవలం మేధస్సును మాత్రమే అభివృద్ధి చేస్తోందని, భవిష్యత్ విద్య ‘చేతన’ స్థాయిని పెంపొందించే దిశగా సాగాలని సూచించారు.
ప్రసంగం ముగింపులో, దేశంలోని విభిన్న ఆరాధనా విధానాలు, భాషలు, సంప్రదాయాల మధ్య ఏకత్వాన్ని నెలకొల్పే శక్తి హిందుత్వేనని నందకుమార్ అన్నారు.“పర్యావరణ సంక్షోభం నుంచి కృత్రిమ మేధ వరకు, భవిష్యత్ సవాళ్లన్నింటినీ ఎదుర్కొనేందుకు హిందూ చైతన్యాన్ని బలోపేతం చేయడం అవసరం. దేశాన్ని ఏకం చేసి, నాగరికతను రక్షించే మార్గం హిందుత్వే” అని ఆయన పిలుపునిచ్చారు.




